YS Jagan Confusion over lockdown continuationఏప్రిల్ 14తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధించిన మూడు వారాల జాతీయ లాక్ డౌన్ పూర్తి అవుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది సర్వత్రా ఆసక్తిగా ఉంది. భారత్ లో కేసులు వేగంగా పెరగడంతో లాక్ డౌన్ పొడిగించక తప్పని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బహిరంగంగా భారత ప్రభుత్వాన్ని కోరారు.

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారట. లాక్ డౌన్ పొడిగిస్తే సాధారణ పరిపాలన కూడా కష్టం అవుతుందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని జగన్ భయపడుతున్నారు. మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చిన జగన్ ఈ పరిస్థితి ఎదురుకుంటే ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

మరోవైపు రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలలో లాక్ డౌన్ పొడిగించి మిగిలిన చోట్ల షరతులతో లాక్ డౌన్ ఉపసంహరించాలని జగన్ ఆలోచనగా ఉంది. అయితే అది ఆచరణీయం కాదని, ఇప్పటివరకూ కేసులు లేని చోట్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణా వలె ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం బలహీనంగా లేదు. చంద్రబాబు నాయుడు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. లాక్ డౌన్ వద్దు అంటే ఆ తరువాత కేసులు పెరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కావాలి అని చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా కరోనా రక్కసి ఇపుడు జగన్ మెడకు చుట్టుకునే ఉంది.