ys jagan completes one year-governance151 ఎమ్మెల్యే సీట్లతో, 22 ఎంపీ సీట్లతో 2019 ఎన్నికలలో విజయఢంకా మోగించింది జగన్ పార్టీ. అప్పుడే ఏడాది సమయం కూడా పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమయంలో పూర్తి స్థాయిలో సంక్షేమపథకాల అమలుపైనే దృష్టి పెట్టారు జగన్. అదే సమయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాది సమయంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తెచ్చే దిశగా ప్రయత్నాలు జరగలేదు.

అయితే జగన్ ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత వచ్చిందా అంటే ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. అదే సమయంలో రాదు అని చెప్పలేని పరిస్థితి. ఒక వర్గం ప్రజలను తాయిలాలతో ఆకట్టుకుంటుండగా, కక్షసాధింపు రాజకీయాలు, వివాదాలు, కనిపించని అభివృద్ధి కార్యక్రమాలు, రాని పెట్టుబడులు ఇంకో వర్గం మీద ప్రభావం చూపిస్తున్నాయి.

అయితే ఇంతటి ఘనవిజయం తరువాత ఒక్క ఏడాదిలోనే ప్రజావ్యతిరేకత రాదు అయితే ఈ సమయంలో జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడకపోతే మాత్రం ప్రమాదం తప్పదు. ఎంతటి ఘనవిజయమైన పదవీ కాలం ఐదేళ్లే అని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు హయాంలో మొదటి ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో విఫలం అయ్యింది.

అమరావతి ఇష్యూ పవన్ కళ్యాణ్ రేకెత్తించే వరకు చంద్రబాబుపై ఎటువంటి వ్యతిరేకత లేదు. అయితే జగన్ కు మొదటి సంవత్సరం నుండే మ్యూజిక్ మొదలైపోయింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అది పెరుగుతుందే గానీ తరగదు. నాలుగేళ్లు అనేది సుదీర్ఘ కాలం ప్రతిపక్షాలకు ఎంతటి అవకాశం ఉంటుందో ప్రభుత్వానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం జరిగిన తప్పులను సవరించుకోవాలి.