YS Jagan complaint letter on Raghu Ramakrishna Raju to narendra modiవైసీపీ ఎంపీగా వ్యవహరిస్తూనే ముఖ్యమంత్రితో పాటు, సొంత పార్టీ నేతలను ఏకిపారేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుతో జగన్ మోహన్ రెడ్డి విసిగిపోయారా? ఇప్పటివరకు నేరుగా ఆర్ఆర్ఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయని జగన్, తాజాగా ‘మా ఎంపీ ఓ రోగ్’ అంటూ పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శ చేయడం అనేది సీఎం ఆగ్రహానికి నిదర్శనంగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

పార్టీకి రాజీనామా చేయకుండా ‘వైసీపీ అండ్ కో’ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించే విధంగా ప్రతి రోజు రఘురామకృష్ణంరాజు నిర్వహిస్తోన్న ‘రచ్చబండ’ కార్యక్రమంతో పాటు, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి, నిధుల వినియోగం గురించి పీఎంవోకు మరియు ఆర్ధిక శాఖకు అనేక లేఖలు రాయడమే జగన్ ఆగ్రహానికి కారణంగా కనపడుతోంది.

టీడీపీతో కలిసి మా పార్టీకి చెందిన ఓ రోగ్ ఎంపీ నిరాధార ఫిర్యాదులు చేస్తున్నారు, రాష్ట్రంలోని సంక్షేమ పధకాల అమలు దెబ్బ తీయాలని లేఖలు రాస్తున్నారు. అలాంటి లేఖలకు వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక శాఖ కోరడం, అలాగే ఏపీ కార్పొరేషన్లకు అప్పులిచ్చే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచనలు చేయడం జగన్ కు మిక్కిలి కోపాన్ని తెప్పించినట్లుగా అర్ధమవుతోంది.

ఈ పర్యవసానాలతో ఏపీకి వచ్చే అప్పులకు కొంత బ్రేకులు పడడం అనేది ‘వైసీపీ అండ్ కో’కు జీర్ణించుకోలేని అంశంగా మారింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఒక ఎంపీ ఇబ్బందులు పెట్టడం బహుశా ఏనాడూ జగన్ ఊహించి ఉండకపోవచ్చు గానీ, నాడు కాంగ్రెస్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే సూత్రాన్ని అవలంభించిన విషయం తెలిసిందే.

మరోవైపు రఘురామకృష్ణంరాజు మాత్రం… తనకంటూ ఓ లక్ష్యం ఉంది, 2024లో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తాను, ఖచ్చితంగా నా లక్ష్యాన్ని అందుకుంటాను, ఇది తధ్యం, అది అందుకునేటంత వరకు విశ్రమించేది లేదంటూ పరోక్షంగా తన ఉద్దేశం ఏమిటో వివిధ సందర్భాలలో విస్పష్టంగా చెప్పారు.

ఒక ఎంపీగా ఉండడం వలనే పీఎంవోకు లేఖలు రాయగలుగుతున్నాను, అక్కడ నుండి నాకు సమాధానాలు వస్తున్నాయి, వీలైనంత ఎక్కువ కాలం ఎంపీగా విధులు నిర్వహించి ఏపీకి ఎంతో కొంత మంచి చేయాలనే భావనలోనే ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేయలేదని, మరోసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఖచ్చితంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని ఇటీవల తెలిపారు.

ఎంపీ యొక్క పూర్తి స్వేచ్ఛను వినియోగించుకుంటున్న ఆర్ఆర్ఆర్, ఇప్పటికీ పార్టీని ప్రేమించడం వలనే జగన్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోతున్నారని, దమ్ముంటే చేసుకోమనే తీరులో మాట్లాడుతున్నారు. మామూలుగానే రోజూ రచ్చబండలో వైసీపీని ఏకే ఆర్ఆర్ఆర్, నేడు వచ్చిన ‘రోగ్’ వార్తలతో ఇంకెంతగా ‘జగన్ అండ్ కో’పై చెలరేగిపోతారో?! ఆర్ఆర్ఆర్ ఇంత చేస్తున్నా ఏమి చేయలేకపోతున్నాననే నిస్సహాయత జగన్ ఆగ్రహానికి అసలు కారణమా?