YS Jagan Compares Himself With MGR and NTRసిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం నర్సీపట్నం సభలో ప్రసంగిస్తూ, “తనకు తాను పార్టీని ఏర్పాటు చేసుకొని అధికారంలోకి వస్తే వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్‌, జగన్‌ అంటారు. అదే… పిల్లనిచ్చిన మామ చేతిలో పార్టీని కబ్జా చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు అని అంటాము,” అని చెప్పుకొన్నారు.

చంద్రబాబు నాయుడుని దెప్పిపొడవాలనే ప్రయత్నంలో జగన్‌ తనని తాను ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ సమఉజ్జీగా చెప్పుకోవడం చూసి సామాన్య ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. ఎందుకంటే జగన్‌ చెప్పినట్లుగానే ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ ఇద్దరూ వారి సొంత శక్తిసామర్ధ్యాలు, ప్రజాభిమానంతోనే రాజకీయ పార్టీలు పెట్టి రాణించారు.

కానీ జగన్‌ మాత్రం చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లుగా తన తండ్రి పేరు చెప్పుకొని ఆయన మరణం తాలూకి సానుభూతి పునాదుల మీద ఓదార్పుయాత్రలతో పార్టీని ఏర్పాటు చేసుకొన్నారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో, ముఖ్యమంత్రిగా లేకపోయుంటే జగన్‌ కూడా రాజకీయాలలో ఉండేవారే కారు. అప్పుడు జగన్‌ అంటే ఎవరో ప్రజలకు తెలిసే అవకాశమే లేదు కదా?

ఇప్పుడు జగన్‌కి తన తండ్రి పేరు చెప్పుకోవలసిన అవసరం లేకపోవచ్చు కానీ ఆనాడు పార్టీ పెట్టిన కొత్తలో ప్రతీ వాఖ్యానికి ముందు “మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు…” అంటూ మొదలుపెట్టి మళ్ళీ దాంతోనే ముగించేవారనే సంగతి బహుశః జగన్‌ మరిచిపోయి ఉండవచ్చు కానీ రాష్ట్ర ప్రజలకి ఇంకా బాగానే గుర్తుంది.

తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించిన ఆయన సోదరి వైఎస్ షర్మిల నేటికీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొంటూ తిరుగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అసలు ఏపీలో వైసీపీ పేరులో, అక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ టిపీ పార్టీల పేర్లలోనే రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అటువంటప్పుడు ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లతో జగన్‌ ఎలా పోల్చుకోగలరు?

ఒకవేళ పోల్చుకొన్నా వారి ఘనమైన రికార్డులు, వారి ఘన చరిత్రలతో తన చరిత్రను పోల్చుకొనే సాహసం చేయగలరా? మరి అటువంటప్పుడు ఎప్పుడో చనిపోయిన ఆ మహానుభావుల గురించి తెలిసీ తెలియకుండా మాట్లాడటం ఎందుకు?వారితో పోల్చుకొని నవ్వులపాలవడం ఎందుకు?చంద్రబాబు నాయుడుని జగన్‌ మనసావాచా కర్మణా ద్వేషిస్తున్నారు కనుక నేరుగా ఆయనతోనే తేల్చుకొంటే పోలా?