పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక మైలురాయి పడింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాపర్ డ్యామ్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్యామ్ వద్ద లోతైన గుంతలు తీసే మెషీన్ కు టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా డయా ఫ్రం వాల్ పనులు ఈ సీజన్ లోనే 50 శాతం వరకూ పూర్తి కావాలని సిఎం అధికారులను ఆదేశించారు.

48 గేట్ల పనులు అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని, మొత్తం 4 వేల మంది నిత్యమూ శ్రమిస్తున్నారని, వారి కష్టంతో నవ్యాంధ్ర వాసుల కల నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. రోజువారీ, నెల వారీ, సీజన్ వారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సంవత్సరం ఏరువాక అనుకున్న సమయానికి సాగుతుందని, వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండటం శుభపరిణామమని తెలిపారు.

ప్రాజెక్టు పూర్తయితే కావాల్సినంత నీరు ఇక్కడి నుంచే లభిస్తుందని, ఈ నీటితో కృష్ణా జిల్లాకు మరింత సాగు, తాగునీటిని అందిస్తామని, ఆ మేరకు మిగిలే కృష్ణానది నీటిని రాయలసీమకు పంపించి రతనాల సీమను చూపిస్తామని చంద్రబాబు తెలిపారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, మరింత వేగంగా మిగిలిన పనులను పూర్తి చేసి అనుకున్న సమయాని కన్నా ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భగవంతుడు తనను ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నానని, రాసిపెట్టి వుంది కాబట్టే ఇంత త్వరగా పనులు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయని… “నేను ఓపెన్ గా చెబుతున్నా. పోలవరం కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో మనం ముందున్నాం. ఐయాం వెరీ హ్యాపీ. భగవంతుడు ఆదేశించాడు. డెస్టినీ నిర్ణయించింది. ఆ పని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం” అన్నారు.

అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనీసం 20 నుంచి 30 సంవత్సరాల పాటు సాగాలన్నది ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆశయమని, అందుకోసమే అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు తన హయాంలోనే పూర్తవుతుందని, పనులను వేగంగా చేసేందుకు అధికారులు కృత నిశ్చయంతో ఉన్నారని, నిధులకు ఎంతమాత్రమూ కొరత లేదని అన్నారు.

నాణ్యతతో పనులు సాగుతున్నాయని, ప్రాజెక్టు ఆలస్యం కావాలన్న జగన్ కల నెరవేరబోదని ఎద్దేవా చేశారు. ఇది ఏపీ అవసరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి, సరైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న ఆలోచనతోనే నిధులిచ్చేందుకు నీతి అయోగ్ నిర్ణయించిందని తెలిపారు. ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా చూసుకుంటున్నానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబు.