ya jagan farmers assurance meeting ganapavaramఒక ఐడియా జీవితానే మార్చేయవచ్చు బెడిసి కొడితే జీవితమే నాశనం కావచ్చు కూడా. సిఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్రంలో ఏ సభలో ప్రసంగించినా తప్పనిసరిగా ‘దుష్ట చతుష్టయం’, ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి ఈ పదాలతో ప్రత్యర్ధులనువిమర్శించాలని ఆయనకు ఎవరు సలహా చెప్పారో కానీ వారికి చేతులెత్తి దండం పెట్టక తప్పదు. ఎందుకంటే, అలనాడు కర్ణుడికి రధసారధ్యం చేసిన శల్యుడే అతని పతనానికి కారణం అయ్యాడు. ఇదీ అలాంటిదే అని చెప్పక తప్పదు. ఏవిదంగానో చూద్దాం.

దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు అని సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంత గట్టిగా సంభోధిస్తుంటే అటునుంచి అవే పదాలు రీసౌండ్‌గా వస్తున్నాయి. ఓసారి దుష్ట చతుష్టయం అని సంభోధిస్తే, ప్రతిపక్షాలు కూడా వైసీపీలో దుష్టచతుష్టయం, చంచల్‌గూడా జైలు పక్షులు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈవిదంగా ఎందుకు జరుగుతోందంటే సిఎం జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయం అనే పదం పలుకుతుండటం వలననే కదా?

ఇదేవిదంగా దత్త పుత్రుడు ఐడియా కూడా బెడిసి కొట్టిందని అర్దమవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్‌ చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అనుకొంటే వచ్చే అపఖ్యాతి, నష్టం ఏమీ లేదు. ఎందుకంటే, వారు ఇద్దరూ రెండు పార్టీల అధినేతలు. అవసరమైతే ఎన్నికలలో కలిసి పనిచేయాలనుకొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇదేమీ నేరం కాదు కదా? కానీ అది నేరమన్నట్లు దత్త పుత్రుడు అని సిఎం జగన్మోహన్ రెడ్డి సంభోధించిన ప్రతీసారి అవతలివైపు నుంచి సిబిఐ దత్తపుత్రుడు అనే రీసౌండ్ వినిపిస్తోంది కదా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు సిబిఐకి దత్తపుత్రుడు అంటే అంతకు మించిన అవమానం మరొకటి ఉంటుందా?

కనుక ప్రతిపక్షాలను అవమానించడానికి లేదా హేళన చేయడానికి ఏదో రెండు గొప్ప పదాలు కనిపెట్టి వాడేస్తున్నామని సంతోషిస్తున్నారే కానీ సరిగ్గా అవే పదాలతో తన ప్రతిష్ట దెబ్బ తింటోందని సిఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లు లేదు. కనుక తనకు ఈవిదంగా శల్య సార్ధ్యం చేస్తున్నవారిని ఎంత త్వరగా వదిలించుకొంటే అంత ఆయనకే మంచిది. లేకుంటే 2024లో జరుగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో పక్కనే ఉండే ఆ శల్యుడే వైసీపీని నిలువునా ముంచేసే ప్రమాదం ఉంటుంది.