YS Jagan comments on opposition party (3)ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీలో అన్-పార్లమెంటరీ పదాలు వాడబడుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా నోరు జారారు. ప్రతిపక్ష పార్టీ తీరు కుక్కతోక వంకర అన్నట్టు ఉంది అని అన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవకతవకలు జరిగాయి, గత ప్రభుత్వం అవసరం లేకున్నా అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసిందని తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి. “ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు కమిటీ వేశాం. అయితే ఆ నిపుణుల కమిటీపై చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు. నివేదిక రాకుండానే అజేయకల్లం, విద్యుత్‌ కార్యదర్శిపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు,” అంటూ విరుచుకుపడ్డారు.

అయితే ఈ ఆరోపణలకు చంద్రబాబు అంతే ధీటుగా సమాధానం చెప్పారు. “కర్ణాటకలో జగన్‌కు డెవలపర్‌గా ఎక్కువ ధర కావాలట. ఇక్కడ మన రాష్ట్రానికి మాత్రం అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కర్ణాటక విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ భవానీ ప్రసాద్‌ ఇచ్చిన కాపీని సభలో చదివి వినిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఆరోపణలు చేసేముందు జగన్‌ కూడా ఒకసారి ఆలోచించాలని చంద్రబాబు హితబోధ చేశారు.