YS Jagan Comments on Chandrababu naidu governmentగత ఏడాదిన్నర్రగా వైసీపీ అధినేత ప్రసంగాలను గమనిస్తే… ఏం చెప్పినా, లేకున్నా… “మరికొద్ది మాసాల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోబోతోంది… మన ప్రభుత్వం వచ్చేస్తుంది… అప్పటివరకు మీ కష్టాలను భరించండి… ఆ తర్వాత నేనొస్తాను… ఇక మీకు బాధలు అనేవి ఉండవు…” అంటూ కొన్ని కామన్ పాయింట్స్ ను అన్ని సభలలో చెప్తున్న వైనం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటంటే… ఒక స్వామీజీ జగన్ కు సదరు విషయాలన్నీ చెప్పి, మీకు కాలం కలిసి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పడంతో.., సదరు మాటలను భుజాన వేసుకున్న వైసీపీ అధినేత, అవే వ్యాఖ్యలను ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు.

జగన్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇప్పటికే టిడిపి ప్రభుత్వం పడిపోయి, తను అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలన్నింటిని తీర్చేయాలి. కానీ జరిగింది ఏమిటి? వాస్తవ రూపంలో కనీసం ఆ దిశగా ఒక్క ఉదంతమైనా జరిగిందా? అంటే… జగన్ ఊహించినది కేవలం ‘కలల ప్రపంచం’ అన్న విషయం తేలిపోయింది. ఇప్పటివరకు జగన్ ఒక భ్రమలో ఉన్నారన్న విషయాన్ని టిడిపి వర్గాలు చెప్తున్నప్పటికీ, వాటిని అంగీకరించే మనసు వైసీపీ వర్గాలకు లేకపోయింది. అయితే తన భ్రమ గురించి వైసీపీ అధినేతకే తెలిసి వచ్చిందేమో గానీ, ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తన నోటితో తానే చెప్పుకొచ్చారు.

బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా, బేతపూడి ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం ప్రసంగించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, “చంద్రబాబు అధికారంలో ఉండేది మరో రెండేళ్ళు మాత్రమే” అంటూ ప్రారంభించారు. ఇక ఆ తర్వాత షరామామూలుగానే… ‘ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళితే బంగాళాఖాతంలోకి వెళ్ళాల్సి ఉంటుంది’ అంటూ రొటీన్ ప్రసంగాన్ని ఇచ్చారు. అయితే ఒక్కసారిగా జగన్ లో ఈ మార్పు ఏమిటన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. మొన్నటివరకు మరో ఆరు మాసాల్లో ప్రభుత్వం పడిపోతుందన్న జగన్ స్వరంలో మార్పు ఎందుకు వచ్చింది?

నిజానికి పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్న టిడిపి ప్రభుత్వం ఏ విధంగా పడిపోతుందో తెలియక రాజకీయ నిపుణులే జగన్ మాటలు చూసి నివ్వెరపోయారు, సాధారణ ప్రజానీకమైతే నవ్వుకున్నారు. ఎలా పడిపోతుందో అన్న దానిపై వైసీపీ అధినేతకు కూడా స్పష్టత లేదన్న విషయం మీడియా పలు సందర్భాలలో జగన్ ను ప్రశ్నించినపుడు బయటపడింది. ఏదో గాలి వాటంగా వ్యాఖ్యానించారని తేలినప్పటికీ, ఇవే వ్యాఖ్యలను పదే పదే మాట్లాడి తన రాజకీయ అనుభవ రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో కనీసం దీనికి చెక్ పెట్టాలని భావించారో ఏమో గానీ, ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం గురించి జగన్ ఒప్పుకోక తప్పలేదు. ఇలాంటి అనుభవలేమి వ్యాఖ్యల వలనే జగన్ ప్రజలలో చులకన భావన ఏర్పరచుకున్నారు.