YS-Jagan-Showcasing-Himself-As-A-Weak-Leaderగతంలో నంద్యాల బై-ఎలక్షన్ సందర్భంగా చంద్రబాబును నడి రోడ్డు మీద ఉరెయ్యాలి, కాల్చి చంపాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం లేపాయి. ప్రజలు వాటిని ఖండించి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. అయినా జగన్ తరచుగా అటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. చంద్రబాబుతో వైరం రాజకీయంగా కాకుండా పర్సనల్ గా తీసుకోవడం వల్ల వచ్చిన అనర్ధాలు అవి. అయితే వీటి వల్ల జగన్ ను చాలా మంది ప్రజలు హింసా ప్రవృతి కలిగిన నాయకుడిగా చూస్తారు.

ఎన్నికల ముంగిట మరల అటువంటి పొరపాటునే వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తుంది. నిరుద్యోగం గురించి ఆ పార్టీ ఇచ్చిన ఒక యాడ్ సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపుతోంది. ఆ యాడ్ లో గత ఎన్నికలలో జాబు రావాలంటే బాబు రావాలని మనల్ని మోసం చేశారు అంటూ ముగ్గురు నిరుద్యోగులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే పలుమార్లు వారి చేత జాబు రావాలంటే బాబు పోవాలి బాబు పోవాలి అంటూ పలుమార్లు చెప్పించడం దారుణం. బాబు ప్రభుత్వం పోవాలని అన్నట్టుగా కాకుండా బాబు పోవాలి అనడం విమర్శలకు దారి ఇచ్చింది.

ఆ పార్టీ పెద్దల సభ సభ్యుడు విజయసాయి రెడ్డి దానిని ట్విట్టర్ లో పోస్టు చెయ్యడం విశేషం. ఎన్నికల వేళ ఇటువంటి వాటికి ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇస్తున్న యాడ్లలో ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతుండగా వైకాపా యాడ్లు చాలా వరకూ ఇలా చంద్రబాబును టార్గెట్ చేస్తూ నెగటివ్ గా ఉన్నాయి. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 23న పార్టీల జాతకాలు బయటపడతాయి.