YS jagan comments on chandrababu naidu nandyal by-electionsనంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎందుకు తిట్ల దండకం అందుకుంటున్నారు? వ్యక్తిగత విమర్శలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? సీఎంను కాల్చండి.. చంపండి.. ఉరితీయండి.. అనడం వెనక ఉద్దేశం ఏంటి? అసలు జగన్ ఇలా ఇలాంటి వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నారు.. ఈ ప్రశ్నల్నింటికీ సమాధానం పీకే. అటు టీడీపీ, ఇటు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక పోరులో గెలవాలంటే నిలవాలన్నదే జగన్ నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

జగన్ గురించి ప్రజలు ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయన్నది అసలు ఉద్దేశమట. అది ప్రశంసా, విమర్శా అన్నది పక్కన పెడితే ప్రజలు ఏదో రకంగా జగన్ గురించి మాట్లాడుకోవాలి, నిత్యం వార్తల్లో ఉండాలి. అప్పుడే విజయం సునాయాసమవుతుందని పీకే వ్యూహమని రాజకీయ పండితులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి రోజైనా గడవక ముందే చంద్రబాబును ఉరితీయాలంటూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిని బట్టి జగన్ నంద్యాల ఉప ఎన్నికలో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు. జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తారు. దానికి ప్రతిగా వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగుతాయి.. ఇలా ఎటు చూసినా జగన్ నామస్మరణతో వాతావరణం వేడెక్కుతుంది. ఏ మూల చూసినా అదే చర్చ జరుగుతుందన్నది పీకే వ్యూహంలో ఓ భాగమని అంటున్నారు. చర్చ ఇటువైపు మళ్లడం వల్ల నంద్యాలలో ఎవరేం చేశారు? అధికారంలో వస్తే ఏం చేయబోతారు? అన్న ప్రశ్నలు తలెత్తవు. కాబట్టి జగన్ ఈ వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇదే సమయంలో ఇది ప్రతికూలంగా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. రాజకీయాలు అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండవు. బహుశా తాను చూసిన ఉత్తరాది రాజకీయాలను తెలుగు నాట ప్రతిబింబించాలంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించకపోవచ్చు అన్న టాక్ కూడా వ్యక్తమవుతోంది. సెంటిమెంట్స్, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తెలుగు ప్రజలు ఇలా గన్ తో కాల్చేయండి, ఉరి తీసేయండి… అన్న పిలుపులకు పెద్దగా స్పందించరన్న విషయం గతంలో చాలా సార్లు నిరూపణ అయ్యింది. అదే జరిగితే గతంలో చిరు తరపున పవన్ చేసిన ప్రచారానికి మెగాస్టార్ ముఖ్యమంత్రి అయ్యుండేవారు.

కానీ అదే ప్రతికూలంగా మారి చిరు ఘోర ఓటమిని చవిచూసిన సంగతి చరిత్ర చెప్తోంది. జగన్ చేస్తున్న హీరోయిజం డైలాగ్స్ బహుశా తెలుగు సిల్వర్ స్క్రీన్ పైన చెప్తే, రెండు మాస్ విజిల్స్ పడతాయేమో గానీ, ఓట్లు రాలాలంటే మాత్రం ఇలాంటి ట్రిక్కులు తెలుగు ప్రజల దగ్గర వర్కౌట్ కావన్న విషయం గమనించుకోవాలి. నిజానికి ఇలా ఏదొక విధంగా తిడుతూ వార్తల్లో నిలవాలని జగన్ ప్రయత్నిస్తుంటే… అదే జగన్ పదే పదే తిడుతున్న చంద్రబాబు అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారన్న లాజిక్ మరిచినట్లు కనపడుతోంది. వైసీపీకి తెలియాల్సిన అసలు విషయం ఏమిటంటే… వార్తల్లో కాదు నిలవాల్సింది… జనం గుండెల్లో అని..!