YS Jagan - colonies- powerఆలు లేదు… శూలు లేదు… అల్లుడేమో రామలింగం… అన్నాడట వెనుకటికొకడు. ప్రస్తుతం ఏపీ సర్కార్ చేసుకుంటున్న పబ్లిసిటీ కూడా అలానే ఉంటోంది. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ప్రతి ఒక్కరికి ఇంటిని కట్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు కార్యరూపం దాల్చలేదని ఇటీవల కేంద్రమంత్రి గారే పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.

ఇల్లు మాట దేవుడెరుగు కనీసం ఇంటి స్థలం అయినా ఇచ్చారా? అంటే ‘ఇదిగో పులి… అదిగో మేక’ మాదిరి వాలెంటైర్ల ద్వారా తొలుత హడావిడి అయితే చేయించారు గానీ, ఇంటి స్థలాలు కూడా పంపిణీ చేయలేని పరిస్థితి. కానీ ఇపుడు చేసుకుంటున్న పబ్లిసిటీ మాత్రం ‘అమోఘం’ అనిపించేలా ఉంది. ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదంటూంటే, ఇపుడు ఇంట్లో ఫ్యాన్లు ఉచితం అంటూ సరికొత్త పబ్లిసిటీకి తెరలేపారు.

జగనన్న కాలనీల పేరుతో నిర్మించే గృహాలకు 5 స్టార్ రేటింగ్స్ తో 2 ఎనర్జీ ఫ్యాన్స్, 4 ఎల్ఈడీ బల్బ్ లు, 2 ట్యూబ్ లైట్స్… ఈ మొత్తంతో ఏటా 539.7 కోట్ల విలువలైన విద్యుత్ ఆదా అంట! ప్రతి ఇంటికి వచ్చే పాటికి 3598 రూపాయలు ఏటా విద్యుత్ ఆదా అవుతుందట! ఈ దిశగా డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టింది వైసీపీ సర్కార్.

ప్రస్తుతం విద్యుత్ చార్జీలను ఏపీ సర్కార్ భారీగా పెంచనున్న నేపథ్యంలో… ప్రజల నుండి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భావనలో, ‘ముందరి కాళ్లకు బంధంగా’ ఈ తరహా ‘విద్యుత్ ఆదా’ పబ్లిసిటీకి తెరలేపినట్లుగా కనపడుతోంది. నాడు ఇలాంటి వాటినే ‘జగన్ అండ్ కో’ గ్రాఫిక్స్ పబ్లిసిటీగా కొనియాడింది. అయితే ఆ గ్రాఫిక్స్ ఇప్పటి ప్రభుత్వానికి కావాల్సిన అప్పులను తెచ్చిపెడుతోంది, అది వేరే విషయం!

మరి ఈ గ్రాఫిక్స్ కట్టడాలు ఎవరికి అప్పులను అందిస్తాయో చూడాలి. బహుశా పేదవాడు ఇల్లు తాకట్టు పెట్టుకోవడానికో లేక అమ్ముకోవడానికో ఉపయోగపడతాయేమో? ముందు పేద వాడి చేతికి రావాలి కదా… తాకట్టు పెట్టుకోవడానికైనా, అమ్ముకోవడానికైనా! అందులోనూ ‘సెల్లింగ్ పాయింట్స్’గా 2 ఎనర్జీ ఫ్యాన్స్, 4 ఎల్ఈడీ బల్బ్ లు, 2 ట్యూబ్ లైట్స్ ఎలాగూ ఉన్నాయిగా!