YS Jagan - KCRప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 3648 కిలోమీటర్ల ప్రజాసంకల్ప పాదయాత్రను నిన్న ఇచ్ఛాపురంలో పూర్తి చేశారు. పాదయాత్ర పూర్తి సందర్భంగా జగన్ వివిధ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పొత్తులపై స్పష్టత ఇస్తున్నారు. ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయ్యబోతున్నామని, జాతీయ స్థాయిలో మాత్రం ఎవరు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వారికి మద్దతు ఇస్తామని అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కావొచ్చని ఆయన చెప్పారు. ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లు వైకాపా గెలుస్తేనే ఇది సాధ్యపడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక్కడి వరకు బానే ఉంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చారని, అవసరమైతే కేంద్రానికి లెటర్ కూడా రాస్తా అని చెప్పారని జగన్ చెప్పుకొచ్చారు. మన (వైకాపా) 25 ఎంపీ సీట్లు, తెలంగాణలోని 17 ఎంపీ సీట్లు మొత్తం 42 ఎంపీ సీట్ల మద్దతు ఉంటుంది గనుక ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో చూద్దామని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ ది ఈ విషయంలో అమాయకత్వమా లేక తెలివి తేటల అనేది చూడాల్సి ఉంది. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అంతకు ముందే దానిని వ్యతిరేకించిన విషయం తెలిసిందే కదా?

తెలంగాణ ఎన్నికలలో తెరాస కాంపెయిన్ మొత్తం మహాకూటమి కి ఓటు వేస్తే ఇక్కడవి అక్కడకు తరలిపోతాయి అనేదాని మీదే గా నడుస్త? ఏపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం అని సోనియా గాంధీ చెబితే వీరందరూ వ్యతిరేకించారు కదా? పార్లమెంట్ లో ఇప్పటికే తెరాస అవలంబించిన రెండు రకాల పద్దతి అందరికీ తెలిసిందే. హరీష్ వంటి వారు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం. పార్లమెంట్ లో మద్దతు ఇచ్చామని చెప్పుకున్నా అదే సమయంలో అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వానికి సహకరించింది నిజం కదా?

అవన్నీ వదిలేసి జగన్ ఇప్పుడు కేసీఆర్ ను ఎందుకు అంత గుడ్డిగా నమ్మేస్తున్నారు? కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కేసీఆర్ మద్దతు తీసుకోవడానికి జగన్ రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ హితం కోసం పని చేస్తారు అని చెప్పడంతో ఆయనకు ఏపీ రాజకీయాలలోకి ఎంటర్ అవ్వడానికి గేట్ పాసు ఇస్తారా జగన్? ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం వస్తే తెరాస తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంది గానీ ఆంధ్ర గురించి ఎందుకు పని చేస్తుంది?