YS Jagan Chandrababu Naiduఅనేక వివాదాల తరువాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా రాజముద్ర వేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి అనధికార ఆర్థిక రాజధానిగా వున్న విశాఖ… అతిత్వరలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా కూడా మారనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం సహా వివిధ ప్రభుత్వ శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో అత్యధిక శాతం విశాఖలో ఏర్పాటు కానున్నాయి.

విజయదశమిలోగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం విశాఖకు తరలించి అప్పటికల్లా అక్కడి నుండి పూర్తి స్థాయిలో పాలన సాగించాలని జగన్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. కోర్టు వివాదాలు ఏవీ చుట్టుముట్టకపోతే అది సాధ్యం అవుతుంది కూడా. అయితే కార్యాలయాలు అన్నీ తాత్కాలిక బిల్డింగులలోనే ఉంచబోతున్నారు.

“ఎంతో అవసరం అయితే తప్ప ఇప్పటికే ఉన్న బిల్డింగులలోనే కార్యాలయాలు కొలువుదీరతాయి. అన్నీ లీజుకు తీసుకున్న బిల్డింగులే. కొత్త కట్టడాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కడన్నా బాగా అవసరమైతే ఒకటి రెండు బిల్డింగులు అది కూడా ఎటువంటి హంగులూ లేకుండా నిర్మిస్తారు.,” అంటూ ప్రభుత్వంలోని వారు అంటున్నారు.

“గతంలో చంద్రబాబు అమరావతి విషయంలో అరచేతిలో వైకుంఠం చూపించి అవి అందుకోలేక ఎన్నికలలో ఓడిపోయారు. అటువంటి పరిస్థితి జగన్ తెచ్చుకునే ఉద్దేశం లేదు. దానితో విశాఖ విషయంలో సహజంగా జరిగే అభివృద్ధి తప్ప, కొత్తగా ప్రభుత్వ పెట్టుబడులు ఉండవు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే నవరత్నలే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత,” అంటూ చెప్పారు.