YS Jagan and Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ ఈ సంక్రాంతి పండుగకు ఒకే నియోజకవర్గంలో బస చేయనున్నారు. చంద్రబాబు ప్రతి ఏడాది తన స్వగ్రామమైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం ఆనవాయితీ. శనివారం చిత్తూరు, తిరుపతిలో పర్యటించనున్న చంద్రబాబు సాయంత్రానికి స్వగ్రామం చేరుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను అక్కడే జరుపుకుంటారు. అనంతరం 16న అమరావతికి బయలుదేరుతారు.

ఇక, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర షెడ్యూలు ప్రకారం… 14న ఉదయం చంద్రగిరి సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే యాత్ర చేపట్టిన మార్గంలో స్వల్ప మార్పుల కారణంగా సంక్రాంతి, కనుమ రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని గ్రామాల్లో బస చేయనున్నారు. ఫలితంగా సీఎం, విపక్ష నేతలు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో ఉండనున్నారు. ఇది యాదృచ్ఛికమే అయినా జిల్లాలో ఆసక్తికరంగా మారింది.