YS Jagan - Chandrababu - Naiduఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండు పార్టీలు ఈ ఎన్నికలు తమకు చావోరేవో అన్నట్టు భావించి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు జనసేన తన తొలి ఎన్నికలలో ఎలాగైనా ప్రభావం చూపించాలని ఆరాటపడుతుంది. ఇది ఇలా ఉండగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటివరకూ ఎన్నికల ప్రక్రియలో కీలకంగా భావించే మేనిఫెస్టోలు విడుదల చెయ్యకపోవడం గమనార్హం.

ఇరు పార్టీలు మేనిఫెస్టోలు సిద్ధం చేసినా వాటి విడుదలను వాయిదా వేస్తూ వస్తున్నాయి. ముందు ఒక పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే అందులోని వాగ్ధానాలను కొంత మెరుగు పరిచి తమ మేనిఫెస్టోలో పొందు పరచాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే నువ్వు ముందంటే నువ్వు ముందు అంటూ తమ మేనిఫెస్టోల విడుదలను వాయిదా వేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం కొత్త రూల్స్ ప్రకారం ఎన్నికలకు 48 గంటల ముందు మేనిఫెస్టోలు విడుదల చెయ్యడం కుదరదు.

48 గంటల ముందు అంటే ఏప్రిల్ 9వ తారీఖు. చివరి నిముషం వరకూ చూస్తారా అనేది చూడాలి. 9వ తారీఖుతోనే ప్రచారం కూడా పూర్తి అవుతుంది. చివరి నిముషం వరకూ ఆగితే మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకుని వెళ్లడం కూడా కష్టమే. దీనితో పార్టీ అధినాయకులు ఏం చేస్తారో చూడాలి. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు గాను పోలింగ్ జరుగుతుంది. దాదాపుగా 3.92 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. ఈ సారి ఉన్న పోటీకి రికార్డు పోలింగ్ జరగబోతుంది అని పార్టీలు అంచనా వేస్తున్నాయి.