YS Jagan CBI Court Corrupt Cases Bailఎలాంటి ప్రయోజనాలు దక్కినా, లేకున్నా రొటీన్ గా అధికార పక్షాన్ని విమర్శిస్తూ కాలం గడిపేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ ఆలోచనలో పడ్డట్లే. ఎవరూ ఊహించని విధంగా స్వయంగా సీబీఐనే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరడం పొలిటికల్ వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది. ఇప్పటికిప్పుడు జగన్ జైలుకు వెళ్ళే అవకాశం లేకపోయినా, ఏప్రిల్ 7వ తేదీన జరగనున్న విచారణ, ఎలాంటి సంచలన నిర్ణయానికి వేదిక అవుతుందో అన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో నెలకొంది.

కేసులను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నాడని, సాక్ష్యులను ప్రలోభ పెడుతున్నారని, దీంతో అతను బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడని అభియోగిస్తూ తగిన సాక్ష్యాధారాలతో పిటిషన్ లో సీబీఐ పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను ఆదేశించింది. సీబీఐ చెప్పినట్లుగా జగన్ సాక్ష్యులను ప్రభావితం చేసాడని రుజువైతే, జగన్ బెయిల్ రద్దు కావడమే తదుపరి చర్య అంటూ న్యాయనిపుణులు కూడా మీడియా వర్గాల వేదికగా అభిప్రాయ పడుతున్నారు.

అయితే దీనిని బలపరచడానికి సీబీఐ ఎంత పకడ్బందీగా తగిన సాక్ష్యాలను కోర్టులో ఇస్తుందో అన్నది కీలకంగా మారింది. సీబీఐ అనుకున్నట్లుగా జరిగితే జగన్ మళ్ళీ జైలు వెళ్ళడం ఖాయమేనా? అదే జరిగితే ఇప్పటికే కుక్కలు చింపిన విస్తరి మాదిరి ఉన్న పార్టీ తలోదారి చూసుకుంటారా? ఇలా ఒక్కటేమిటి… అనేకానేక ప్రశ్నలను సీబీఐ పిటిషన్ లేవనెత్తింది. దీంతో రాబోయే నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అత్యంత కీలకంగా మారనున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

రాజకీయాలలో ఎప్పుడూ ముందు చూపు ఉండాలి అంటారు. అయితే జగన్ కు గానీ, ఆ పార్టీకి గానీ లేనిదే అది అని చెప్పవచ్చు. పార్టీలో నెంబర్ 2 అనే స్థానానికి అవకాశం లేకుండా… అన్ని తానై నియంతలా పార్టీని నడిపే జగన్, మరొకసారి కటకటాల పాలైతే పార్టీ కార్యక్రమాలను ఎవరు చూసుకుంటారు? మరోసారి షర్మిలను బరిలోకి దింపుతారా? ఇప్పుడే ఇలాంటి ఆలోచనలు చేయడం కాస్త తొందరపాటే అవుతుంది గానీ, జగన్ తగిలిన షాక్ రీత్యా, ఇప్పుడైనా కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తే… ఏపీలో మరో కాంగ్రెస్ పార్టీలా మారకుండా ఉంటుంది.