YS Jagan - CBI Court ప్రతి శుక్రవారం కోర్టు హాజరుకు మినహాయింపు నివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటీషన్ లో సిబిఐ వేసిన కౌంటర్ ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతుంది. దానిని అస్త్రంగా చేసుకుని విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. ప్రతి వారం కోర్టుకు హాజరు కాకపోతే కేసును ప్రబావితం చేస్తారని సిబిఐ వాదన

విజయవాడ – హైదరాబాద్ మద్య పెద్ద దూరం కాదు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపెట్టడం వంక మాత్రమే అని సిబిఐ అభిప్రాయపడింది. కోర్టు విచారణకు హాజరైతే రెండు రోజుల సమయం వృధా అవుతుందని పేర్కొనడం అతిశయోక్తని, ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను మాయం చేస్తారని అరెస్టు చేశాం. ఇప్పుడు జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. ఈ కేసులో అనేక మంది సాక్షులు ప్రభుత్వ అధికారులే. ముఖ్యమంత్రి హోదాను వారిని ప్రభావితం చేసేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని సిబిఐ కోర్టుకు చెప్పుకొచ్చింది.

అయితే సిబిఐ వాదనలో పస లేనట్టు అనిపిస్తుంది. నిజమే ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఒక్క రోజు ఆయన కోర్టుకు వస్తే ఆ అవకాశం పోదు కదా? వారంలోని మిగతా ఆరు రోజులూ ఆయన సాక్షులను ప్రభావితం చేసే పనిలోనే ఉండవచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి?

నిజంగా అది సిబిఐకు ఇబ్బంది అయితే అసలు జగన్ కు బెయిల్ నే రద్దు చెయ్యమని కోర్టుని అడగాలి కదా? ఇదేదో నామ్ కే వాస్తే వ్యతిరేకించడమా? జగన్ ను రక్షించడం లేదు అని ప్రజలకు చాటి చెప్పడం కోసం వేస్తున్న స్టంట్ అనుకోవాలా? లేక నిజంగానే జగన్ కు సహకరించేది లేదని కేంద్రం ఇస్తున్న మెస్సేజా?