YS Jagan campaign at flood effected placesప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలతో వరద బాధితులను పరామర్శించేందుకు ఎట్టకేలకు కదిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్, “భయపడాల్సింది లేదు, తానున్నాను, కొంచెం సమయం ఇవ్వండి, అన్ని సర్దుబాటు చేస్తాను, ఇల్లు కూడా కట్టిస్తాను” అంటూ అభయహస్తం ఇచ్చారు.

బాధితులకు ధైర్యం చెప్తే అందులో విమర్శలు చేయడానికేముంటుంది? కానీ అసలు సినిమా అది కాదు అనే విధంగా ముఖ్యమంత్రి సెల్ఫీలు సోషల్ మీడియాను ముంచేసాయి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే… స్వయంగా ముఖ్యమంత్రే ‘సెల్ ఫోన్ యాడుందక్కా’ అంటూ ప్రజలను అడిగే వరకు! అందుకే ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట చేస్తున్న హంగామాకు కొదవలేదు.

ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు కూడా ప్రస్తావించారు. విమానంలో వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ… ఇది ఓదార్పు యాత్ర కోసం వెళ్తున్నట్లు కనిపించడం లేదు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లుగా ఉంది, మీరే నిర్ణయించుకోండి… అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ ఫోటోలో సీఎంతో సహా వైసీపీ నేతలందరూ నవ్వుతూ కనిపించడం రఘురామ వంటి వారు చేస్తున్న విమర్శలకు తావిస్తోంది. అలాగే ప్రజలను పరామర్శించే సమయంలో కూడా జగన్ చిరుదరహాసం చిందించడం నెటిజన్ల ట్రోలింగ్ కు ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా ఈ యాత్రలో సెల్ఫీలతో జగన్ బాధితులను ముంచేసారన్న అంశం హైలైట్ అవుతోంది.

ఈ సందర్భంలోనే గతంలో జగన్ చేసిన సంచలన ‘ఓదార్పు యాత్ర’ అంశం కూడా తెరపైకి వచ్చింది. వైఎస్ చనిపోయినపుడు చేసిన ‘ఓదార్పు’ యాత్రలో జగన్ ఇలా నవ్వలేదే, మరి ఇప్పుడు వరద బాధితుల ఓదార్పులో ఈ నవ్వులెందుకు? అని నెటిజన్లు నాటి – నేటి అంశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ప్రతిపక్షం ఎప్పుడు ఎలాంటి అవకాశం ఇస్తుందా? అని వేచిచూస్తోన్న తెలుగుదేశం పార్టీ తరపున తెలుగు తమ్ముళ్లు కూడా ఈ ట్రోలింగ్ లో ఏకమయ్యారు. అధికార పక్షంలో ఉన్నపుడు ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరిపాలించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. మరి ఏకంగా సీఎం తీసుకుంటున్న సెల్ఫీలే వైరల్ కు కారణమైతే ఎలా?! కాస్త ఆలోచించండి!