YS Jagan - Chandrababu Naiduప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 9న పూర్తి చెయ్యబోతున్నారు. ఈ క్రమంలో మీడియా చాన్నాళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చాలా కాలంగా పచ్చ మీడియా అంటూ విమర్శిస్తున్న టీవీ9 కు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. సొంత మీడియాను దాటి జగన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇంటర్వ్యూ సందర్భంగా జగన్ తెలంగాణ ఎన్నికల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ లేఖ రాస్తా అనడాన్ని ఆయన స్వాగతించారు.

తనకు కేసీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాహుశా మా ఇద్దరి మధ్యా ఉన్న వయసు తేడా వల్ల కావొచ్చు అని చెప్పుకొచ్చారు. ఆయనతో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ఫోన్ లో మాట్లాడా అని చెప్పుకొచ్చారు జగన్… అది కూడా కావాలనే చేశా అని చెప్పారు. దీనితో ఇంటర్వ్యూ చేసిన టీవీ9 రజినీకాంత్ ఎందుకు కావాలనే చేశారు అని అడిగారు దానికి ఆయన కావాలనే చేశా చంద్రబాబును ఓడించారని చేశా అని చెప్పుకొచ్చారు.

‘కావాలనే చేశా’, ‘చంద్రబాబును ఓడించారని చేశా’ అనే పదాలను జగన్ నొక్కి చెప్పడం చెబుతున్నప్పుడు ఆయన మొహంలో మాటలలో ఆ కసి కూడా కనపడటం విశేషం. గతంలో కూడా జగన్ చాలా సందర్భాలలో చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా వ్యక్తిగత శత్రువుగా చూడటం మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ ధోరణి వల్ల ఆయన నష్టం చేకూరింది కూడా. నంద్యాల ఉప ఎన్నికలలో వైకాపా ఓడిపోవడానికి జగన్ చేసిన చంద్రబాబును ఉరి తియ్యాలి, రాళ్ళతో కొట్టి చంపాలి వంటి వ్యాఖ్యలు కూడా కారణమే.

అయినా జగన్ పాఠం నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. రాజకీయ నాయకులెప్పుడు అంశాలపై పోరాడాలి గానీ వ్యక్తుల మీద కాదు. ఇటువంటి ధోరణిని ప్రజలు హర్షించరు. కొంత మంది తెలుగుదేశం నాయకులు అప్పుడప్పుడు జగన్ ఫ్యాక్షన్ నేపథ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రకమైన వ్యాఖ్యలు దానిని ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్తాయి. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎవరికైనా కంట్రోల్ అనేది ఉండాలి జగన్ వంటి ముఖ్యమంత్రి కావాలనుకునే వారికి అది మరీ అవసరం.