YS Jagan ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లోని ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని పూడ్చడానికి జగన్ తన కేబినెట్ లో కొద్ది పాటి మార్పులు చెయ్యబోతున్నట్టు సమాచారం. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు.

ఈ ప్రకారం రాజ్ భావన్ కు ప్రభుత్వం నుండి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల స్థానంలో వారి సామాజికవర్గం వారినే నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం కేబినెట్ నుండి తప్పుకునే ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే.

ఇందులో పిల్లి సుభాష్ శెట్టిబలిజ కాగా, మోపిదేవి మత్సకార వర్గానికి చెందిన వారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చని వార్తలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చాకా జగన్ చేస్తున్న మొట్టమొదటి కేబినెట్ విస్తరణ ఇది.

అయితే ఈ విస్తరణలో ఉద్వాసనలు ఏవీ ఉండబోవని సమాచారం. ఇప్పటికే రెండున్నర ఏళ్ళ తరువాత దాదాపుగా మొత్తం కేబినెట్ ని మార్చి వేరే వారికి అవకాశం ఇస్తానని జగన్ ప్రకటించారు. కావున అప్పటివరకూ ఉద్వాసనలు ఉండవని అంటున్నారు.