ys jagan buttering narendra modi at vizag meetingరాష్ట్రంలో టిడిపి, జనసేనలు ఇంతవరకు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటున్నట్లు ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ వాటిది అనైతిక బంధమని, టిడిపి కోసమే పవన్‌ కళ్యాణ్‌ పనిచేస్తున్నారని, ఆయనో ప్యాకేజ్ స్టార్ అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వరకు ప్రతీ ఒక్కరూ ఎద్దేవా చేయని రోజంటూ లేదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ, బిజెపిలో విలీనం అయిపోయిందా అన్నట్లు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన హడావుడి అంతా ఇంకా కాదు. నగరమంతా ప్రధానికి స్వాగతం చెపుతూ వైసీపీ నేతలు బ్యానర్లు, స్వాగత తోరణాలు పెట్టించారు. ఇక ప్రధాని సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసి లక్షకు పైగానే జనసమీకరణ చేసారు.

ఇక సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి తెలుగులో ప్రసంగించినా ప్రధాని నరేంద్రమోడీని పొగుడుతున్నాననే విషయం ఆయనకి అర్దం అయ్యేలా సర్…సర్ అంటూ మాట్లాడారు. కేంద్రం సహాయసహకారాలతో తాను రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని నొక్కి చెప్పారు. ఇక అతి ముఖ్యమైన విషయం… కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని కనుక పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో బలమైన సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.

అంటే వైసీపీ చేస్తే కాపురం, అదే… టిడిపి, జనసేనలు ఇంకా పొత్తులు పెట్టుకోకపోయినా… అటువంటి ఆలోచన చేసినా అది రాజకీయ వ్యభిచారమని జగనన్న తీర్పు చెపుతున్నట్లే ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండటం తప్పుకానప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి, జనసేనలు కూడా చేతులు కలపాలనుకొంటే తప్పెలా అవుతుంది?

అసలు కేంద్రం విదిలించే అప్పుల కోసమే జగన్ ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీకి ఇంత వీరవిదేయంగా ఉంటోందనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా చెలిమి అని చెవిలో కాలీఫ్లవర్ పువ్వులు పెడుతుంటే సభకు వచ్చిన జనాలు చప్పట్లు కొట్టక ఏం చేస్తారు?

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉండటం నిజమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకోగలిగారా?ప్రత్యేకహోదా తదితర విభజన హామీలను అమలుచేయాలని నేటికీ విజ్ఞప్తులు ఎందుకు చేయవలసివస్తోంది?జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ళలో కేంద్రం నుంచి ఏం సాధించింది అంటే ఎడాపెడా అప్పులు మాత్రమే కనబడుతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదనుకోలేము. ఏపీ గురించి ప్రతీ విషయమూ తనకు బాగా తెలుసునని ప్రధాని నరేంద్రమోడీ నిన్న రాత్రే తనను కలిసిన పవన్‌ కళ్యాణ్‌కి చెప్పారు. ఈరోజు ఉదయం సభలో జగన్ తమ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకరించిందని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పుకొన్నారు!

కేంద్రం ఇచ్చిన ప్రతీరూపాయిని రాష్ట్రాభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొన్నారు. కానీ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను వాటికి దక్కనీయకుండా వేరే అవసరాలకు మళ్లించడం వాస్తవమా కాదా?కేంద్రం రాష్ట్రాభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నట్లయితే మళ్ళీ అప్పులు చేయవలసిన అవసరం ఏమిటి? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు ఉంది?

పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో స్నేహం అనిపైకి చెప్పుకొన్నప్పటికీ నిజానికి పార్టీలు, రాజకీయాలు, వాటి రాజకీయ సమీకరణల కోసమే జగన్ ప్రభుత్వం ప్రధాని పర్యటనలో ఇంత హడావుడి చేసిందని అందరికీ తెలుసు. నేటి నుంచి ఏపీ బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై చేయబోయే విమర్శలే వాస్తవ రాజకీయాలకు పరిస్థితికి అద్దం పడతాయి.