YS-Jagan-Blames-TDP-for-Andhra-Pradesh-Debtsఆంధ్రప్రదేశ్‌లో జరిగిపోతున్న అద్భుతాలన్నిటికీ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వమే కారణం. జరిగే తప్పులు, లోపాలన్నిటికీ టిడిపియే కారణం. క్రెడిట్ మాది… డెబిట్ మీది అనే ఈ ఫార్మూలాను మూడేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం దిగ్విజయంగా అమలుచేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇందుకు తాజా ఉదాహరణ: వైసీపీ ప్రభుత్వం రూ.17,265 కోట్లు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుంచి ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ (ఐఈఎక్స్‌) నుంచి రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ కొనుగోలు చేయడానికి, మిగులు విద్యుత్‌ అమ్ముకోవడానికి వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విదించింది. దీంతో రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ కోతలు మొదలయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

దీనిపై టిడిపి తమ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, ప్రజలలోకి వెళ్ళి ఎండగడుతుందని వైసీపీ ప్రభుత్వం ముందే పసిగట్టింది. అందుకే వెంటనే ఆత్మసాక్షిలో డెబిట్-క్రెడిట్ ఫార్ములా ప్రకారం ఈ సమస్యని టిడిపి, చంద్రబాబు నాయుడు ఖాతాలో వేస్తూ అప్పుడే ఓ కధనం ప్రచురించేసింది. ప్రజల ఆగ్రహాన్ని టిడిపిపైకి మళ్ళించి దానిని ఎదుర్కొనేందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కోసమే ఈ స్టోరీ అని వేరే చెప్పక్కరలేదు.

ఏపీ డిస్కంలు ఐఈఎక్స్‌కి రూ.17,265 కోట్లు బకాయి పడ్డాయని ఆత్మసాక్షి పేర్కొంది. అదంతా టిడిపి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నిర్వాకమే అని వర్ణించింది. ఆ బకాయిని తమ ప్రభుత్వం 12 వాయిదాలలో తీర్చేందుకు ఐఈఎక్స్‌తో ఒప్పందం చేసుకొని ఈ నెల 6వ తేదీన రూ.1,422 కోట్లు చెల్లించిందని పేర్కొంది. టిడిపి హయాంలో ట్రూఅప్ పేరుతో ప్రజలను బాదేందుకు డిస్కంలను అనుమతించకపోవడం వలన రూ.20 వేల కోట్లు నష్టం వచ్చిందని ఆత్మసాక్షి పేర్కొంది. ఈ మూడేళ్ళలో డిస్కంలు ఆర్ధిక సంస్థల నుంచి రూ.38,836 కోట్లు అప్పులు తీసుకొన్నాయని, వాటికి తమ ప్రభుత్వం మరో రూ.40,000 కోట్లు సాయం అందించిందని ఆత్మసాక్షి చెప్పింది.

ఇదంతా చదివిన తర్వాత ఎవరికైనా కొన్ని సందేహాలు కలుగుతాయి.

1. ఈ మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం రూ.40,000 కోట్లు సాయం అందించగా, డిస్కంలు మరో రూ.38,836 కోట్లు అప్పులు తీసుకొన్నాయి. ఈ రెండూ కలిపితే రూ.78,836 కోట్లు. ఇవి కాక నెలనెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నది, ట్రూఅప్ బాదుడు దీనికి అదనం. మరి ఇంత సొమ్ము చేతిలో ఉన్నప్పుడు ఐఈఎక్స్‌కి మూడేళ్ళుగా రూ.17,265 కోట్లు విద్యుత్‌ బకాయిలు ఎందుకు చెల్లించలేదు?ఆ రూ.78,836 కోట్లు ఎక్కడికి పోయాయి?

2. ఒకవేళ ఇవన్నీ గత ప్రభుత్వం బకాయిలే అనుకొన్నా మరి ఈ మూడేళ్ళలో డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు చేయలేదా?ఆ బకాయిలు చెల్లించకపోవడంతో అవే పేరుకు పోయి రూ.17,265 కోట్లు అయితే వాటిని ఈవిదంగా గత ప్రభుత్వం నెత్తిన రుద్ది తప్పించుకోవాలని ప్రయత్నిస్తోందా?

3. మూడేళ్ళుగా బకాయిలు చెల్లించకుండా ఈ నెల (ఆగస్ట్ 6వ తేదీ)న రూ.1,422 కోట్లు చెల్లించామని ఒప్పుకొంటోంది కదా?నెలనెలా వినియోగరుల నుంచి టంచనుగా విద్యుత్‌ బిల్లులు ముక్కుపిండి మరీ వసూలు చేసుకొంటున్నప్పుడు, ఐఈఎక్స్‌కి ఎప్పటికప్పుడు చెల్లించకుండా రూ.17,265 కోట్లు ఎందుకు బాకీ పడింది?

4. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ట్రూఅప్ పేరుతో ప్రజలపై రూ.20,000 కోట్ల భారం వేయనీయలేదని ఒప్పుకొంటున్నట్లే కదా?