YS Jagan blames opposition రాష్ట్రంలో వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ.. విగ్రహాల ధ్వసం జరుగుతుంది. ఈరోజు కూడా రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల నుండి అటువంటి వార్తలు వచ్చాయి. అయితే పదుల సంఖ్యలో అటువంటివి జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క కేసుని కూడా పోలీసులు చేధించలేకపోయారు. ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది.

ఈ విషయాన్ని ప్రతిపక్షాల మీదకు నెట్టేసి తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చెయ్యడం గమనార్హం. “రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది.అర్ధరాత్రి అందరూ పడుకున్నాక దేవాలయాలపై దాడులు చేస్తున్నారు.దాడులు చేస్తున్నవారే మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు,” అంటూ ఆయన ఆరోపిస్తున్నారు.

ఒకవేళ ముఖ్యమంత్రి అన్నదే నిజం అనుకుందాం. అయితే అందరూ పడుకున్నాక దేవాలయాలపై దాడులు చేస్తుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? వారు కనీసం కనిపెట్టలేనంత నిద్రావస్థలో ఉన్నారా? రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ అంటూ రాజకీయ విమర్శలు చెయ్యడం తేలికే.

అయితే దానిని నిరూపించేలా ఒక్క ఆధారమైన ప్రభుత్వం ఇప్పటివరకు చూపించిందా? ఇలా కేవలం ఆరోపణలకే పరిమితం అయితే ప్రభుత్వం చేతకానిది గానూ.. తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద సాకులు చెప్తుంది అని ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కనీసం దోషులను పట్టుకునో లేక ఇక పై దాడులు జరగకుండానో చేస్తేనే ప్రభుత్వం క్రెడిబిలిటీ నిలబడుతుంది.