YS Jagan blames courts
న్యాయ వ్యవస్థ మీద పోరాటానికి సిద్ధమైంది జగన్ ప్రభుత్వం. కాబోయే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్ర అభియోగాలు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ కి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని జడ్జీలను ప్రభావితం చేసి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచి కూలదోయడానికి రమణ ప్రయత్నిస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు జగన్.

జగన్ ప్రభుత్వానికి దాదాపుగా ఏడాదిన్నర కాలంలో హైకోర్టులో 100 వరకూ వ్యతిరేక తీర్పులు వచ్చిన విషయం వాస్తవమే. అయితే వీటిలో మెజారిటీ విషయాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని సామాన్యుడికి సైతం అర్ధం అవుతుంది. అలాగే కొన్ని కేసులలో ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే అక్కడ కూడా హైకోర్టు తీర్పులని అప్ హెల్డ్ చేశారు.

అందులో కొన్ని తీర్పులు సాక్షాత్తు చీఫ్ జస్టిస్ బాడ్డే ఇచ్చినవే. ఈ ప్రకారం ప్రభుత్వం తాము చేసినవన్నీ కరెక్టే… చంద్రబాబు న్యాయవ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నారు కాబట్టే అటువంటి తీర్పులు వచ్చాయి అనే ఉద్దేశంలోనే ఉన్నట్టుగా ఉంది. ఆ ప్రకారం ప్రభుత్వం ఇన్ని వ్యతిరేక తీర్పులు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన కూడా చెయ్యడం లేదు.

ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్ళింది ప్రభుత్వం. చీఫ్ జస్టిస్ బాడ్డే కు సంబంధించిన బెంచ్ ఈ కేసుని వింటుంది. ఇంకా తుది తీర్పు రాలేదు గానీ హియరింగ్ సందర్భంగా బాడ్డే చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కూడా జగన్ న్యాయవ్యవస్థనే బ్లేమ్ చేస్తారా?