YS Jagan Big Notes Ban Responseపెద్ద నోట్లను రద్దు చేసిన ప్రకటన వచ్చి రెండు రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నుండి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం విశేషం. ఒక్క జగన్ మాత్రమే కాదు, పార్టీ పరంగా కూడా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవడం గమనించదగ్గ విషయం. అయితే జగన్ మీడియాలో మాత్రం ‘సమర్దించినట్లు’గా వ్యాఖ్యలు రాసుకుంటున్నారు తప్ప, ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. దీంతో అసలు మోడీ తీసుకున్న నిర్ణయానికి జగన్ అనుకూలమా? వ్యతిరేకమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

జగన్ విషయాన్ని పక్కన పెడితే, జగన్ మీడియాలో మాత్రం సదరు నోట్ల రద్దు వలన కలిగే ప్రయోజనాల కంటే కూడా, పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను హైలైట్స్ చేస్తూ కధనాలు ప్రసారం చేస్తున్నారు. ఏపీలో ఉన్న అధికార పార్టీ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ రోజే ఒక ప్రకటన జారీ చేయగా, కాంగ్రెస్ విభేదిస్తూ ఆ సమయంలోనే ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఏపీలో కీలక పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా ‘మౌనం’ వహించడంతో అనేక రకాల సందేహాలకు తావిచ్చినట్లయ్యింది.

ఏపీలో ఉన్న మరో పార్టీ ‘జనసేన’ కూడా ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరచనప్పటికీ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడంతో జనసేన విషయం పెద్దగా పరిగణనలోనికి తీసుకునేది కాదు. అయితే వైసీపీ అధినేత పరిస్థితి అలాంటిది కాదు. మోడీని విమర్శించాల్సిన ప్రతి సందర్భంలోనూ ఆరోపణలు చంద్రబాబు మీద చేస్తూ కాలం వెలిబుచ్చుతున్న జగన్, కరెన్సీ కట్టల విషయంలో ఒక రకంగా తన మీడియా ద్వారా అదే వినిపించే ప్రయత్నం చేసారు. మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ విషయం ముందుగా చంద్రబాబుకు ఎందుకు తెలిసిందని తన మీడియా ద్వారా కధనాలు ప్రసారం చేసింది తప్ప, పార్టీ పరంగా అధికారికంగా వెల్లడించలేదు. మరి దీని మర్మమేమిటో..?! ఎవరికి ఎరుక..!?