Jagan-Bhogapuram-Airportఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాలతో పోటీ పడేవిదంగా ఉండాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు దాని కోసం సింగపూర్ సంస్థతో అద్భుతమైన డిజైన్ చేయించారు. మన రాజధాని ఇలా ఉండబోతోందంటూ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఆ చిత్రాలను మీడియాకు విడుదల చేశారు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపి ప్రజలను మభ్యపెట్టారని ఎద్దేవా చేసింది. అయినప్పటికీ ఆ ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు నాయుడు అమరావతిలో అనేక భవనాలను నిర్మించారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఆ గ్రాఫిక్స్‌ను కళ్ళ ముందు సాక్షాత్కరింపజెసి ఉండేవారు. కానీ ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

ఇప్పుడు వైసీపీ నేతలు విశాఖలో రాజధాని ‘ఏర్పాటు చేశాక’ విశాఖనగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇంకా చెప్పుకొంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆనాడే ఏపీలో విశాఖనగరం ఆర్ధికరాజధానిగా నిలుస్తుందని ఊహించి, నగరానికి సమీపంలో భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. అప్పుడే దాని కోసం వందల ఎకరాలు భూసేకరణ చేసి నాలుగేళ్ళ క్రితమే శంకుస్థాపన కూడా చేశారు. నేడు దానికే సిఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో అమరావతిని పాడుపెట్టిన జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించాలనుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ భోగాపురం విమానాశ్రయం నిర్మించే ఉద్దేశ్యమే ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే నిర్మాణపనులు చేపట్టి ఉండేదిగా?కానీ నాలుగేళ్ళు కాలక్షేపం చేసి ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు, మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో తెలీని పరిస్థితులలో ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారంటే అర్దం ఏమిటి?ప్రజలను మభ్యపెట్టేందుకేనా?

అందుకే… విమానాశ్రయం ఇలా ఉంటుంది… అలా ఉంటుంది…. మహాద్భుతంగా ఉంటుందని చెపుతూ విమానాశ్రయ నమూనా చిత్రాలను విడుదల చేశారా?ఆనాడు టిడిపి ప్రభుత్వం అమరావతి నమూనా చిత్రాలను విడుదల చేసినప్పుడు గ్రాఫిక్స్… ప్రజలను మభ్యపెట్టడానికే అని వాదించిన వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చేస్తోంది కదా?అంటే ఇదీ ప్రజలను మభ్యపెట్టేందుకేనా?

ఆనాడు టిడిపి ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించినప్పటికీ దాని ప్రకారమే సాధ్యమైనంత వరకు అమరావతి నిర్మాణపనులు చేసింది. టిడిపి ప్రభుత్వం కట్టిన ఆ భవనాలలోనే వైసీపీ నేతలు కూర్చొని పరిపాలన చేస్తున్నారు. అమరావతిని, పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయలేక చేతులు ఎత్తేసిన వైసీపీ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం నిర్మించగలదా? ప్రభుత్వోద్యోగులకు నెలనెలా జీతాలు కూడా చెల్లించేకపోతున్న వైసీపీ ప్రభుత్వం తొలిదశ నిర్మాణపనుల కోసం రూ. 4,592 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది?