YS-Jagan-Bharat-Kuppam-YSRCP-Incharge“రాష్ట్రంలో టిడిపి, కుప్పంలో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. రాబోయే ఎన్నికలలో 175 సీట్లు మావే. కుప్పంలో ఓడిపోతానని చంద్రబాబు నాయుడు నైరాశ్యంలో మునిగిపోయారు. అందుకే తనకు ఇవే చివరి ఎన్నికలన్నారు…” సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో నాయకులందరూ పాడుతున్న పాట ఇది.

కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించాలని పట్టుదలగా ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రెండుమూడు సార్లు పర్యటించారు. ఎమ్మెల్సీ భరత్ ఈసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెపుతూ ఆయనని నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. చిత్తూరు జిల్లా బాద్యత కూడా ఆయనకే అప్పగించారు. భరత్ సూచన మేరకే కుప్పం అభివృద్ధి పనులకు రూ.63 కోట్లు కేటాయిస్తున్నానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు కూడా. కానీ హటాత్తుగా భరత్‌ స్థానంలో ఉప ముఖ్యమంత్రి నారాయనకి అప్పగించారు! అంటే సిఎం జగన్‌ చెప్పుకొంటున్నట్లు చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పుంజుకోలేదనే కదా అర్దం? పుంజుకొంటే భరత్‌ని ఎందుకు మార్చినట్లు?

ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు… రాష్ట్రంలో పలు జిల్లాలలో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉందని తెలియజేస్తున్నట్లు విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతితో కలిపి మొత్తం 8 జిల్లాల పార్టీ అధ్యక్షులను సిఎం జగన్‌ మార్చేశారు.

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ యాదవ్‌, సజ్జల రామకృష్ణారెడ్డి లను ఆ పదవులలో నుంచి తప్పించేసి, కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను జడ్పీ చరిమన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డికి అప్పగించారు. మాజీ మంత్రి బాలినేని పనితీరుపట్ల సిఎం జగన్‌ అసంతృప్తిగా ఉన్నప్పటికీ మాజీ మంత్రి అనిల్ కుమార్‌ స్థానంలో తిరుపతి, వైఎస్సార్ జిల్లాల బాధ్యతలను అప్పగించారు.

కొడాలి నాని చేతిలో ఉన్న పల్నాడు జిల్లా బాధ్యతను భూమన కరుణాకర్ రెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణ స్థానంలో విజయనగరం జిల్లా బాధ్యతని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డి చూసుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లా బాధ్యతను బొత్స సత్యనారాయణకి అప్పగించారు.

ఇక పార్టీలో సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీలో 23 అనుబంధ సంఘాల విభాగాలకు కోర్డినేటర్‌ నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఆయన ఎంపీ, రాష్ట్ర స్థాయి సమన్వయకర్త విజయసాయి రెడ్డితో కలిసి పనిచేస్తారని వైసీపీ తెలియజేసింది.

సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్ధంగా అమలుచేయలేకపోవడమే ఈ మార్పులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలలో పర్యటించినప్పుడు భారీగా ప్రజలు తరలిరావడంతో వైసీపీ కంగుతింది. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తున్నా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో వైసీపీకి వాస్తవ పరిస్థితి అర్దమైనట్లుంది.

తాము 175 సీట్లు గెలుచుకొంటామనే భ్రమలో కాలక్షేపం చేస్తుంటే రాబోయే ఎన్నికలలో ఎదురుదెబ్బ తింటామని సిఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్లు ఈ మార్పులు చేర్పులు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రజల ఆకాంక్షలు గుర్తించకుండా ఇష్టారాజ్యం చేస్తూ పార్టీలో మార్పులు చేర్పులు చేసినంత మాత్రన్న వైసీపీని ప్రజలు ఆదరిస్తారా?అప్పులు చేసి మరీ లక్షల కోట్లు పంచిపెడుతున్నా ప్రజలలో తమ పార్టీ పట్ల వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? అని ఓసారి సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే మంచిదేమో?