YS Jagan Dictatorఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు ఎవరూ రాష్ట్రంలో పర్యటించడానికి వీలులేదు. ఒకవేళ వారు ఎక్కడికైనా బయలుదేరాలనుకొంటే ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. తెలియజేస్తే వారి పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెంటనే నోటీస్ ఇచ్చేస్తారు. రాష్ట్రంలో పర్యటించేందుకు పోలీసులు అనుమతించడంలేదు కనుక పార్టీని మూసుకొని ఇంట్లో కూర్చోవాలని వైసీపీ ప్రభుత్వం పరోక్షంగా సూచిస్తున్నట్లుంది.

నిజానికి ప్రతిపక్ష నేతలు పర్యటనకు బయలుదేరినా వైసీపీ ప్రభుత్వం సహించలేకపోతోంది. అలాగని వారు ఇంట్లో కూర్చొన్నా ఊరుకోవడం లేదు. తమకు భయపడి పిరికిపందల్లా హైదరాబాద్‌లో కూర్చొని తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు.

మొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనకు వస్తే ఇదే జరిగింది. నిన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ కడప జిల్లాలో పర్యటించినప్పుడూ ఇదే జరిగింది. వారి పర్యటనలకు పోలీసులు ముందే అనుమతి నిరాకరించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం టిఆర్ఎస్‌ పార్టీ మాత్రమే ఉండాలని, ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకొన్న సిఎం కేసీఆర్‌ ఇలాగే వ్యవహరించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ఏకఛత్రాధిపత్యం చేయాలనుకొన్నారు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరూ చూస్తున్నారు. గంగిగోవు వంటి కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న అత్యంత శక్తివంతమైన బిజెపిని కేసీఆర్‌ చేజేతులా తెచ్చిపెట్టుకొని ఇప్పుడు దాంతో పోరాడుతున్నారు. జగన్ కూడా గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో ఇదేవిదంగా వ్యవహరిస్తున్నారు.

అయితే కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని అన్నివిదాల అభివృద్ధి చేసి చూపి, రాష్ట్రానికి ఏటా వేలకోట్ల పెట్టుబడులు సాధిస్తూ, అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలను రప్పించగలుగుతున్నారు. కనుక ఆయన నిరంకుశత్వాన్ని తెలంగాణ ప్రజలు భరిస్తున్నారు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి ఏమీలేకపోగా కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా మరమత్తులు చేయించలేకపోతున్నారు. పైగా మూడు రాజధానుల పేరుతో చేస్తున్న హాడావుడితో రాష్ట్ర ప్రజల మద్య ప్రాంతీయ విభేదాలు, విద్వేషాలు రగులుకొంటున్నాయి. ఈ మంటలు వైసీపీనే కాదు… రాష్ట్రాన్ని కూడా దహించివేసే ప్రమాదం పొంచిఉంది.

వైసీపీ మంత్రుల వాచాలత, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను చూసి సామాన్య ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే కర్రున్నవాడిదే బర్రె అన్నట్లు వైసీపీ పాలన సాగుతోంది కనుక ఎవరూ మాట్లాడే సాహసం చేయడం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ వంటి వారు నోరెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తే వారిపై మంత్రులు, ఎమ్మెల్యేలు తమ హోదాను మరిచి చాలా అనుచితంగా మాట్లాడుతుంటారు. పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటనపై, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ విజయవాడలో సమావేశమవడం, వారి సంయుక్త ప్రకటనపై వైసీపీ నేతలు స్పందిస్తున్న తీరే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అయితే దేశంలో అధికారపార్టీలు గాడి తప్పిన ప్రతీసారి ప్రజలు వాటిని నిర్ధాక్షిణ్యంగా ఓడగొట్టి పక్కనపడేస్తుంటారు. మహామహా నియంతలే కొట్టుకుపోయారు. కనుక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి ఆకాంక్షల ప్రకారం వారు మెచ్చేలా పరిపాలన చేసుకొంటే మరో అవకాశం ఇస్తారు. లేదా వైసీపీకి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ కావచ్చు.