YS-Jagan-Bail-extendedఎంతో ఉత్కంఠను రేపిన వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు కాకపోవడంపై వైసీపీ వర్గాల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. దీంతో సీబీఐ వాదనను తోసిపుచ్చి, బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి, జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని న్యాయస్థానం తెలిపింది.

అంతేకాకుండా, జగన్ న్యూజిలాండ్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే న్యూజిలాండ్ కు సింగిల్ గా వెళ్లకూడదని, కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాలని కోర్టు షరతు విధించింది. మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ మధ్యలో న్యూజిలాండ్ కు వెళ్లవచ్చని సూచించింది. 15 రోజుల పాటు న్యూజిలాండ్ వెళ్లవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే సదరు వార్తలపై జగన్ మీడియా హర్షించే కధనాలు ప్రచురితం చేసినప్పటికీ, అసలు కధ వేరే ఉందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

నిజానికి జగన్ బెయిల్ రద్దవుతుందని వైసీపీ కూడా భావించిందని, జగన్ కూడా దీనికి మానసికంగా సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దయినట్లుగా కోర్టు తీర్పు వెలువరించగానే… దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబుపైకి నెట్టివేసే విధంగా… పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో బ్రహ్మానందం ఎపిసోడ్ చూపించిన తరహాలో… జగన్ బెయిల్ రద్దయితే ఒకటి, కాకపోతే మరొకటి… ఇలా ముందస్తుగా కధనాలు కూడా ప్రిపేర్ అయ్యాయని పొలిటికల్ వర్గాల్లో సెటైరికల్ ప్రచారం జరుగుతోంది.

ప్రత్యేక హోదాపై పోరాడుతున్న జగన్ ను ఎలాగైనా అణగద్రోక్కాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని, అందుకే ఉన్న పళంగా జగన్ బెయిల్ రద్దయ్యిందని… ఇలా తమకు అనుకూలంగా కధనాలను సిద్ధం చేసుకోగా, చివరికి జగన్ బెయిల్ రద్దు కాకపోవడంతో, సదరు కధనాలన్నీ వృధా అయిపోయాయని వైసీపీ వర్గాలు నిరాశ చెందినట్లుగా ఈ వార్తల సారాంశం. అయితే ఇప్పటికి పోయేదేమీలేదు… భవిష్యత్తులో వాటి ఉపయోగం ఉండవచ్చు అంటూ పడుతున్న కౌంటర్లకు కూడా కొదవలేదు.