YS Jagan avoids mediaఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే 30వ తేదీ వస్తే మూడేళ్లు పూర్తవుతాయి. ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రిగా ఏం చేసారో, ఏం చేయలేదో అన్నది పక్కన పెడదాం. ఎందుకంటే ప్రభుత్వ పరంగా తాము అన్ని చేసేసాము అంటూ అధికారంలో ఉన్న పార్టీ చెప్పుకుంటుంది, అసలేమీ చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇది సహజం.

అంతిమంగా ప్రజలు అన్ని గమనిస్తుంటారు, ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు మీడియా వర్గాలకు జవాబు ఇవ్వలేకపోతున్నారు? కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు నిర్వహించ లేకపోతున్నారు?

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సహజంగా ఆరు నెలలకోసారైనా ప్రెస్ మీట్ నిర్వహించి, మీడియా వర్గాలు అడిగే ప్రశ్నలకు జవాబిస్తుంటారు. ఎందుకంటే ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ప్రశ్నలు వేయలేరు గనుక, ప్రజల తరపున మీడియానే ప్రజావాణిగా సీఎంను ప్రశ్నిస్తూ జవాబులు రాబడుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అతీతం కాదు, ఒక్క జగన్ సర్కార్ తప్ప!

ఎక్కడో ఎందుకు, పొరుగున ఉన్న కేసీఆర్ చాలా సార్లు మీడియా ముందుకు వచ్చారు. సొంత మీడియా అయినా, ప్రత్యర్థి మీడియా అయినా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. నెలకోసారి కాకపోయినా రాష్ట్రంలో ఏదైనా కీలక విషయం జరిగినపుడో లేదంటే సంచలనం సంఘటనలు జరిగినపుడో మీడియా ముందుకు వచ్చి బదులివ్వడం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కూడా! గతంలో వైఎస్సార్ కూడా అనేక సందర్భాలలో మీడియా సంధించిన ప్రశ్నలకు జవాబిచ్చిన వైనం జగన్ కు తెలియనిది కాదు.

మరి జగన్ సర్కార్ ఏం చేస్తోంది? అంటే… ముఖ్యమంత్రిగా తాను వివరణ ఇవ్వాలనుకుంటే… పేపర్ ముందు పెట్టుకుని తాను చెప్పాల్సింది ఏదో చెప్పేసి, మీడియా అడగడానికి ఎలాంటి ప్రశ్నలకు తావు లేకుండా వెళ్లిపోవడం ఏపీ సీఎం స్టైల్ గా మారింది. ఇంకొంచెం లోతుకు వెళితే, అలా పేపర్ మీద ఉన్నది చూసి చదవడంలో కూడా ఏపీ సీఎం పడుతోన్న ఇబ్బందులు తెలియనివి కాదు.

ఒకవేళ అది కాదనుకుంటే, సీఎం చెప్పాల్సినదంతా ఓ ప్రీ రికార్డింగ్ వీడియోను రూపొందించి మీడియాకు అందజేయడం జరుగుతుంది. సరే ఇవన్నీ కూడా పరిగణించి రాష్ట్రానికి మంచి చేస్తున్నారే అనుకున్నా, అసలు సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతున్నారు? అన్న అంశం మాత్రం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఓ పక్కన తెలంగాణాలో కొత్తగా పార్టీ పెట్టిన జగన్ సోదరి షర్మిల సైతం, ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ… మీడియా వర్గాలు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిస్తున్నారు. ఒకవేళ తాను ఇబ్బంది పడుతోన్న ప్రశ్న వస్తే, తాను స్పందించనని స్పష్టంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కనీసం షర్మిల మాదిరి అయినా జగన్ ఎందుకు మాట్లాడలేకపోయారు? అన్నది అర్ధం కాని విషయం.

బహుశా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా బోలెడన్ని ప్రశ్నలను మీడియా సంధిస్తుందని భయమా? అన్ని ప్రశ్నలు ఎదురవుతాయని ముందే అంచనా వేయగలిగారా? మీడియా అడుగుతుందని భయమా లేక వాటికి జవాబు చెప్పలేమని భయమా? లేక పాలనలోని అన్ని సబ్జెక్టుల మీద అవగాహన లేకపోవడం వలన మీడియా ముందుకు రాలేకపోతున్నారా?

ఇవాళ కాకపోతే రేపైనా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అధికారం ఎల్లవేళలా కాపాడదు. మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజలకు సవివరంగా తెలపాల్సిన బాధ్యత సీఎంపై ఉంది, అంతకంటే ముందుగా ప్రజల మదిలో నెలకొన్న అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన ఆవశ్యకత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిపై ఉంది.

ఇంకా చేతిలో రెండేళ్ల పాటు అధికారం ఉండనుంది, కనీసం ఒక్క సారైనా మీడియాకు ప్రశ్నలను వేసే అవకాశాన్ని ఇస్తారేమో చూద్దాం. ఒకవేళ ఆ ఒక్కసారి కూడా ఇవ్వలేదంటే అయిదేళ్ల జగన్ పాలన గురించి ప్రజలు ఏమని అర్ధం చేసుకోవాలో?! పాదయాత్ర సమయంలో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని జగన్ అన్నట్లుగా, మీడియా కూడా సీఎంను ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని అభ్యర్ధించుకోవాలేమో!?