YS Jagan attends PONGULETI SRINIVAS REDDY son weddingఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో బిజీ గా గడిపారు. గన్నవరం నుండి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చిన జగన్ రెండు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన ముందుగా తెరాస నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొడుకు నిశ్చితార్దానికి సతీసమేతంగా హాజరయ్యారు.

ఆ తరువాత అటునుండి అటు తాజ్‌కృష్ణలో జరిగిన ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి వెళ్లారు. అయితే ఈ ట్రిప్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎస్టీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఆమె స్వస్థలం శరభన్నపాలెంలో జరిగింది.

ఆమె కమ్యూనిస్టు నేత గొడ్డేటి దేముడు కుమార్తె. బీఎస్సీ బీఈడీ చేసిన మాధవి పలు పాఠశాలల్లో పీఈడీ టీచర్‌గా పనిచేశారు. ఇక గొడ్డేటి మాధవి కొండదొర సామాజిక వర్గానికి చెందిన వారు. లోక్‌సభ నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కిషోర్ చంద్రదేవ్ పై 2లక్షల 21వేల ఓట్ల భారీ మెజార్టీతో గొడ్డేటి మాధవి విజయం సాధించారు.

డబ్బున్న రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల ఇళ్లలో పెళ్లిళ్లకు మాత్రం వెళ్లి సొంత పార్టీకే చెందిన పేద ఎస్టీ ఎంపీ పెళ్ళికి వెళ్లలేదని వారు ఆక్షేపిస్తున్నారు. ఈ ఆరోపణ వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఏజెన్సీ ఏరియాలో పెళ్లి జరగడం వల్ల ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోయారని వారు చెబుతున్నారు. అయితే వధూవరులను కలిసి వారిని దీవిస్తారని వారు సమర్ధించుకున్నారు.