Jagan Attends CBI Court For The First Time as The Chief Ministerఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటి సారిగా ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరు అయ్యారు. జగన్‌తో పాటు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు.

అటునుండి ఆయన కాన్వాయ్ తో కోర్టుకు చేరుకున్నారు. రెండు గంటల పాటు సీఎం జగన్‌ కోర్టులోనే ఉండనున్నారు. కోర్టు మెయిన్ గేట్ వరకే మీడియాకు అనుమతి ఇచ్చారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు.

గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చాయి. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదనరావు ఈ నెల 3వ తేదీన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని…లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కాక తప్పలేదు. అయితే ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ముందు ముద్దాయిలా నిలబడాల్సి రావడం రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించేదే.