Andhra Pradesh - From No Capital to Three Capitals!ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉండటం వల్ల రెండు కీలకమైన బిల్లులు పాస్ కాలేదు. దీనితో ఆగ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు మండలి అవసరం ఉందా అని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పొదుపు చర్యల పేరుతో మొత్తానికి మండలినే రద్దు చేసే అవకాశముందని అన్నారు.

మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఆధిక్యం రావాలంటే 2021 వరకూ ఆగాల్సిందే. అయితే ఇప్పుడు రద్దుపై పునరాలోచన చేస్తున్నారట. మండలి రద్దు అయితే సొంత నేతలకు కూడా ఆశ్రయం ఇచ్చే విషయంలో ఇబ్బంది ఎదురుకావొచ్చు. అదే సమయంలో వచ్చే ఎన్నికలప్పుడు కూడా సీట్ల సర్దుబాటులో తలపోట్లు వచ్చే అవకాశం లేకపోలేదు.

రద్దు చెయ్యకూడదు అనుకుంటే మాత్రం టీడీపీ ఎమ్మెల్సీలను ఆకర్షించాలి. అయితే దాని వల్ల అనవసరమైన చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనితో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం 58 సభ్యులు గల మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఏడుగురు మాత్రమే ఉన్నారు. టీడీపీకి 26, బీజేపీకి ముగ్గురు, ఇతరులు 17 ఉన్నారు.

వీరిలో మూడులో ఒకింత మంది సభ్యులు 2021లో రిటైర్ అవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు 151 సీట్లు రావడంతో వీటిలో మెజారిటీ ఆ పార్టీకే దక్కుతాయి. అయితే జగన్ కు అంతవరకూ వేచి చూసే ఓపిక ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.