YS-Jagan-APSRTC-Employees-జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నష్టాలలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణాశాఖలో విలీనం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఆయనకు జేజేలు పలికారు. అది చూసి టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ సిఎం కేసీఆర్‌ మీద ఒత్తిడి చేసేందుకు ప్రయత్నించారు కానీ ఫలించలేదు. కనుక వారితో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు చాలా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.

కానీ ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు అశోతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన సిఫార్సులను పక్కనపడేసి, ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు వారికిస్తున్న ఫిట్‌మెంట్‌ను పెంచకపోగా దానిలో 1.6 శాతం కోత విధించింది. అదేవిదంగా ఆర్టీసీ ఉద్యోగులకు 4.7 శాతం డీఏ ఇవ్వాల్సి ఉండగా దానిలో కూడా 1.6 శాతం కోత పెట్టి 3.1 శాతాన్ని మూలవేతనంలో కలుపుతున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది.

అయితే దీని వలన డిపో మేనేజర్ ఆ పైస్థాయి అధికారుల వేతనాలు కొంత తగ్గుతాయి. కానీ దిగువ స్థాయి ఉద్యోగులకు అంటే డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్స్ తదితరులకు పెద్దగా నష్టం ఉండదు. కానీ తాజా ఉత్తర్వులతో ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ, హెచ్ఆర్ఏలు పెరుగుతాయి. ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్, జీవిత భీమా వగైరా అన్నీ పొందుతారు.

అలాగే ఉద్యోగ విరమణ చేసిన తరువాత వారి అభీష్టం ప్రకారం ఈపీఎఫ్-95 లేదా సీపీఎస్‌లో చేరి ఆయా ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగ విరమణ సమయానికి వాడుకోకుండా మిగిలిన సెలవులకు డబ్బు లభిస్తుంది. ఉద్యోగ ఆరోగ్య పధకం, వైద్య ఖర్చులు, డెత్ రిలీఫ్ వగైరా అన్ని ప్రయోజనాలు పొందుతారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు తాజా జీవోతో ఇంకా మరికొన్ని ప్రయోజనాలు కూడా పొందుతారని స్పష్టం అయ్యింది. కనుక జగనన్న రాజ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కరే కాస్త అదృష్టవంతులని చెప్పక తప్పదు.