YS Jagan grudge on Galla Jayadhevతెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌, ఆయన కుటుంబానికి చెందిన కంపెనీకి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ఫోటెక్‌కు కేటాయించిన భూమిలో సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2010లో చిత్తూరు జిల్లా యడమర్రి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు ప్రభుత్వం కేటాయించింది. పదేళ్లు దాటినా నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

అయితే ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. “అమర రాజా అనేది ఒక నమ్మకమైన బ్రాండ్. కొన్ని సార్లు చెప్పిన మేర పెట్టుబడులు పెట్టడంలో ఆలస్యం జరగవచ్చు. అయితే కంపెనీకి ఉన్న పేరు ప్రఖ్యాతలను బట్టి ప్రభుత్వం ఆ విషయంలో కొంత సడలింపులు ఇస్తుంది. అయితే గల్లా టీడీపీ వారు కాబట్టే అది జరగలేదు,” అని నిపుణుల అభిప్రాయం.

1.2 బిలియన్ డాలర్ల కంపెనీ అమర రాజా… పైగా అంతర్జాతీయంగా పేరున్న కంపెనీ. ఇటువంటి తరుణంలో ఆ కంపెనీని ఇబ్బంది పెడితే అది రాష్ట్రంలోకి కొత్తగా వద్దాం అనుకునే పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టే. దీనిపై ఇప్పటివరకు గల్లా జయదేవ్ స్పందించలేదు.