ys jagan andhra pradesh special statusఅధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని విస్తారంగా వాడుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రత్యేక హోదా మీదే ఆధారపడి ఉందని… తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ మోహన్ రెడ్డి తరచూ చెప్పే వారు. అయితే అధికారంలోకి వచ్చాకా కేంద్రంతో సఖ్యత పేరుతో దానిని పక్కన పెట్టేశారు.

అసలు ఆ అంశం గురించే మాట్లాడటం మానేశారు అధికార పక్ష నేతలు. తాజాగా మంత్రి పేర్ని నాని దాని గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు. “కేంద్ర ప్రభుత్వానికి భారీ మెజారిటీ వచ్చిన కారణంగా ఆ విషయంగా తాము ఏమీ చెయ్యలేమని సీఎం జగన్ ముందే చెప్పారు,” అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కూడా బీజేపీకి మెజారిటీ ఉంది కదా అని అడిగితే… “అప్పట్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి అడిగాం. మోడీ గల్లా పట్టుకుని అడగాలని ఎప్పుడు చెప్పలేదు. అసలు ఒక సీఎంకు ప్రధానమంత్రి గల్లా పట్టుకుని అడిగే అవకాశం ఉంటుందా?,” అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడం విశేషం.

జీఎస్టీలో రాష్ట్ర వాటా కేంద్రం ఎగ్గొడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే… “మేము వ్యతిరేకించడం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మాకు బీజేపీ, టీడీపీ, జనసేన, కేఏ పాల్ సహా అందరూ ఉమ్మడి శత్రువులే,” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయం అని తేల్చి చెప్పేసింది అధికార పార్టీ.