YS- Jaganఆంధ్రప్రదేశ్ ని అప్పుల ఊబిలోకి నెడుతుంది జగన్ ప్రభుత్వం. దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కుదేలు చేస్తుంది. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ అప్పులు 97,000 కోట్లు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్లలో 1,61,928 కోట్లు అప్పు చేసింది. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 2,58,928 కోట్లు.

దానికే అప్పట్లో ప్రతిపక్షం… (ఇప్పటి అధికార పక్షం) నానా యాగీ చేసేది. అయితే జగన్ పార్టీ అధికారంలోకి రావడంతోనే పరిస్థితి పూర్తిగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం వంద రేట్లు బెటర్ అనిపించేలా అప్పులు చెయ్యడం మొదలుపెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసిన అప్పు…1,14,212 కోట్లు.

2020 ఏప్రిల్ నుండి 2020 నవంబర్ లోపు చేసిన అప్పులు మాత్రమే 73,811. కోట్లు. నెలకు రమారమీ 9226.375 కోట్ల రూపాయలు అప్పులు తెస్తుంది ప్రభుత్వం… అంటే ఈ ఆర్ధిక సంవత్సరంలో ని తదుపరి సమయంలో చేసే అప్పులతో దాదాపుగా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పును జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేస్తుంది.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే… లాక్డౌన్ కారణంగా ఆదాయంలో కొరత ఉందని పేర్కొంటూ ప్రజలపై పన్నులు మరియు సెస్ మొత్తం రూ .21,000 కోట్లు విధించింది. ఇదే కాలంతో పోల్చితే రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ .8 వేల కోట్ల అదనపు గ్రాంట్లు వచ్చాయి. అయినా సరే అప్పులు తప్పలేదు. ఏపీ ఖర్చు పెట్టే ప్రతీ 100 రూపాయిలలో 45 రూపాయిలు అప్పులుగా తెచ్చినవే అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.