YSJagan_AndhraPradesh_Global_ Investors_Summit_2023టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు పీలేరు నియోజకవర్గంలో 36వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్నారు. మొన్న రెండు రోజుల పాటు విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయంటూ జగన్ ప్రభుత్వం చెప్పుకోవడంపై నారా లోకేష్‌ స్పందిస్తూ అవన్నీ బోగస్ బోగస్ ఎంవోయూలు.. కాకి లెక్కలే… ఇవిగో వాస్తవాలు అంటూ పీలేరులో ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించారు.

“ఇదొక ఫేక్ లోకల్ సమ్మిట్. ఎందుకంటే ఇందులో అసలు పారిశ్రామికవేత్తల కంటే కడప, పులివెందుల, ఇంకా వైసీపీకి చెందినవారే పారిశ్రామికవేత్తల వేషాలు వేసుకొని వచ్చారు. ఉదాహరణకి ఇండోసోల్ అనే కంపెనీ 2022లో స్థాపించబడింది. దీనిలో డైరెక్టర్స్ అందరూ పులివెందుల బ్యాచ్. దీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం లక్ష రూపాయలని రికార్డ్స్ లో చూపారు. ఈ కంపెనీ ఇప్పుడు ఏపీలో రూ.76,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోందిట!ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు, కడప, కృష్ణా జిల్లాలో 25,000 ఎకరాలు భూములు కట్టబెట్టబోతోంది. కేవలం లక్షరూపాయలు పెట్టుబడి కలిగిన కంపెనీ రూ.76,000 కోట్లు పెట్టుబడి ఎలా పెట్టగలదు? దానికి ప్రభుత్వం25,000 ఎకరాలు భూములు కేటాయించబోతుండటం అంటే ఎంత పెద్ద మోసం జరుగబోతోందో అర్దం చేసుకోవచ్చు. అందుకే ఇదొక బోగస్ సమ్మిట్ అని అంటున్నాను,” అని నారా లోకేష్‌ వివరించారు.

రెన్యువబల్ ఎనర్జీ (సోలార్ విద్యుత్‌ ఉత్పత్తి) రంగంలో రాష్ట్రానికి రూ.9,57,139 లక్షల కోట్లు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించుకొంది. దీనిపై కూడా నారా లోకేష్‌ వాస్తవాలు వివరించి చెప్పారు. “ఒక్కో మెగావాట్ విద్యుత్‌ ఉత్పత్తికి సుమారు రూ.4.5-5 కోట్లు ఖర్చవుతుంది. ఈ లెక్కన వచ్చిన పెట్టుబడిని దివియడ్ చేసి చూస్తే దాంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సుమారు 2 లక్షల మెగావాట్స్. దాని కోసం 10 లక్షల ఎకరాల భూమి కావాలి. మన దేశంలో గత ఏడాది జూన్ నెలల్లో గరిష్ట విద్యుత్‌ వినియోగం 2 లక్షల 50 మెగావాట్స్ అని లెక్కలున్నాయి. మన రాష్ట్రం గరిష్ట వినియోగం 14 వేల మెగావాట్స్. అంటే జగన్ ప్రభుత్వం యావత్ దేశానికి సరిపడే విద్యుత్‌… అదీ సోలార్ ద్వారానే ఉత్పత్తి చేయబోతున్నట్లు చెపుతోందన్నమాట! ఇది అసలు నమ్మశక్యంగా ఉందా?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

NaraLokesh