YS Jagan Andhra Pradesh Finance Debtsసంక్షేమ కార్యక్రమాల హడావిడిలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఒక ఏడాదికి చెయ్యదలచుకున్న అప్పులో రాష్ట్ర ప్రభుత్వం 68% తొలి మూడు నెలలలో చేసేసింది అంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ సమయంలో కేవలం ఈ 15 నెలల జగన్ పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్క పౌరుడిపై 20,000 అప్పు ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చెప్పిన లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి.

“ఈ 15 నెలల అప్పు తీస్తే, ఒక్కోవ్యక్తి పై 20 వేల అప్పు భారం పడింది. కుటుంబానికి నలుగురు ఉంటే, 80వేలు అప్పు. అమ్మ ఒడి, అదీ ఇదీ అని చెప్పి, ఏదో ఒక పధకమే ఇస్తున్నారు. అంటే మనకు10-15 వేలు ఇచ్చి, 80వేల భారం మన నెత్తిన మోపుతున్నారు. మరి మిగతా 70 వేలు నీకు రాకుండా ఎటుపోతుంది?,” అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నీ తల మీద ఉన్న అప్పు నువ్వే కట్టు అని ప్రజలని అడగదు… రకరకాల పన్నులు… ఛార్జీల పెంపు ద్వారా ప్రజల నుండే పిండుకుంటారు.

ఇది ఇలా ఉండగా… కరోనా కారణంగా ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయినా ఆమేరకు ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. వేలంవెర్రిగా అనేక పేర్లతో సంక్షేమ పథకాలు పెట్టి డబ్బుల పందేరం చేస్తున్నారు. కరోనా కారణంగా కేంద్రం ఇచ్చిన అప్పుల పెంపు వాడుకోవడానికి ప్రభుత్వం ఆర్డినెన్సు తెస్తుంది.

ఆ ప్రకారం మరింత అప్పులు చేసే వెసులుబాటు రావడంతో ప్రభుత్వం విచ్చలవిడితననానికి అడ్డుఆపూ లేకుండా పోతుంది. అయితే ముందుముందు రాష్ట్ర భవిష్యత్తు మీద ఇది పెనుభారం చూపనుంది. స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం ప్రజలు ఇటువంటివి గుర్తించనప్పుడు జరిగే దుష్పరిణామాలకు వారు వారినే నిందించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు.