YS_Jagan_Elections_2023ఓ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ నుంచే ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతుండటం కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాము. ఈ ఏడాది జనవరి నుంచి టిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ పాదయాత్ర, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బస్సు యాత్ర చేయాలనుకొన్నారు. కానీ ముందస్తు ఎన్నికలు జరుగవచ్చని సమాచారం అందడంతో ఇద్దరూ తమ యాత్రలని వాయిదా వేసుకొన్నారు. కానీ జగన్‌ ముందస్తుకి వెళ్ళబోవడంలేదని తెలియడంతో నారా లోకేష్‌ జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించేశారు. మార్చి నుంచి పవన్‌ కళ్యాణ్‌ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నట్లు తాజా సమాచారం. అంటే ముందస్తు ఎన్నికలు లేవని టిడిపి, జనసేనలు భావిస్తున్నాయనుకోవచ్చు.

మార్చి నెలాఖరుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అప్పులు చేసుకొనేందుకు రాష్ట్రాలకి అనుమతిస్తుంది. కనుక వాటిని తీసుకొని సంక్షేమ పధకాలకి పంచిపెట్టేసిన తర్వాత బహుశః మే, జూన్ నెలల్లో జగన్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళ్ళవచ్చని టిడిపి ఎన్నికల వ్యూహాల కమిటీ భావిస్తోంది.

అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించలేని దుస్థితికి చేరుకొంటుంది కనుక వారు ప్రభుత్వంపై పోరాటలు మొదలుపెట్టేస్తారు. కనుక వారి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే ముందస్తు ఎన్నికలకి వెళ్ళడం ఒక్కటే మార్గం అని టిడిపి ఎన్నికల వ్యూహ కమిటీ భావిస్తోంది.

వైసీపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి అసంతృప్తి నేతలు ఇంకా చాలా మందే ఉన్నారు. వారు పక్కచూపులు చూడటం మొదలుపెట్టక మునుపే జాగ్రత్తపడటం చాలా అవసరం. త్వరలోనే సుప్రీంకోర్టు కూడా అమరావతా లేదా మూడు రాజధానులా తేల్చి చెప్పేస్తుంది. దానిని, సంక్షేమ పధకాలని అస్త్రాలుగా చేసుకొని జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళడం ఖాయమని టిడిపి భావిస్తోంది.

కనుక రాష్ట్రంలో 35 నియోజకవర్గాలని ఒక జోన్‌గా తీసుకొని ఆయా జోన్లలోని టిడిపి నేతలు, టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్ధులతో సమావేశాలు నిర్వహించడానికి టిడిపి ఏర్పాట్లు చేసుకొంటోంది. ఈ నెల 21వ తేదీన కడపలో, 22న నెల్లూరులో, 23న అమరవతిలో, 24న ఏలూరులో, 25న విశాఖపట్నంలో ఈ కీలక సమావేశాలు జరుగనున్నాయి.