YS Jagan Andhra Pradesh Budget 2020 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 నుండి మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా వల్ల అవి జరిగే అవకాశం దాదాపుగా లేనట్టే. అయితే మరోవైపు ఈ ఆర్ధిక సంవత్సరం ఈ నెలాఖరుతో పూర్తి కానుండడం బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఖర్చుకు డబ్బులు ఉండవు. దీనితో ప్రభుత్వం సందిగ్దావస్థలో పడింది.

ప్రజలు ఒకచోట చేరకూడదు అన్నది లాక్ డౌన్ ఉద్దేశం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే దీనిని ఉల్లంఘించాల్సిన పరిస్థితి వస్తుంది. బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా బడ్జెట్ విషయంలో ఆర్డినెన్స్ ను తీసుకురావాలని చూస్తున్నది. గతంలో 2004లో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇలాగే బడ్జెట్ ని ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించుకుంది.

అయితే అప్పటికే చంద్రబాబు మీద అలిపిరిలో ఎటాక్ జరగడంతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. సభ లేని సమయంలో ఆర్డినెన్సు సంగతి వేరు గానీ సభ ఉండగా ఆర్డినెన్సు జారీ చెయ్యడం రాజ్యాంగవిరుద్దం అని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం నిపుణులతో చర్చలు జరుపుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కేవలం ఒక్క రోజు జరిపి బడ్జెట్ ని ఆమోదింపచేసుకోవాలని ఆలోచన చేసింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. బడ్జెట్ ఈ నెల 31లోగా ఆమోదం పొందకపోతే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యడానికి అనుమతి ఉండదు. అటువంటి పరిస్థితిలో కరోనా కట్టడి చర్యలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది.