YS_ JAGAN_Andhra_Pradesh_Legislative_Assemblyగురువారం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. తొలిరోజు తర్వాత అయినా సమావేశాలు సజావుగా సాగుతాయని ఆశించిన వారికి రెండవ రోజు ఉదయం కూడా ‘వాయిదా’ ప్రకటన దర్శనమిచ్చింది. ‘కాల్ మనీ’పై చర్చ చేపట్టిన తర్వాతే ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్షం పట్టుబడుతుండగా, తొలిరోజు పెండింగ్ లో వున్న అంశాలు ముగిసిన తర్వాత, ‘కాల్ మనీ’పై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు అందరూ చర్చించుకోవచ్చని, సమయాభావం రీత్యా సమావేశాలు సజావుగా సాగనివ్వాలని స్పీకర్ కోరారు.

అయితే ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత చర్చించడానికి ఏమీ ఉండదని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్వరం వినిపించారు. బీఏసీ సమావేశంలోనే ఈ పాయింట్ ను అడిగి ఉండాల్సిందని, ఆ సమావేశంలో మీ పార్టీకి చెందిన నేతలు కూడా అంగీరించి, ఇపుడు రాద్ధాంతం చేయడం తగదని స్పీకర్ ఎన్ని సార్లు చెప్పినప్పటికీ జగన్ మరియు ఆ పార్టీ నేతలు సమావేశాలకు అడ్డు పడుతూ వచ్చారు. అలాగే, స్పీకర్ పోడియం చుట్టూ చేరుకున్న వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో ప్రతిపక్ష నేత జగన్ తో సహా ఆ పార్టీ సభ్యులందరినీ స్పీకర్ సస్పెండ్ చేసారు. అయినప్పటికీ జగన్ వర్గం వెళ్ళకుండా నినాదాలు చేస్తుండడంతో ‘మార్షల్స్’ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

దీనికి తోడు వైసీపీ నేతలు తమ చేతిలో ఉన్న కాగితాలను చింపి స్పీకర్ పైకి విసిరేసారు. ఈ పరిణామాలతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నాయకులను ఒక్కొక్కరిగా మార్షల్స్ బయటకు తీసుకు వెళ్లినప్పటికీ, అసెంబ్లీ ప్రాంగణం వద్ద బైటాయించి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ‘కాల్ మనీ’ అంశంపై చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, సభను సజావుగా సాగనివ్వకపోవడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటా అన్న రీతిలో రాజకీయ విశ్లేషకులు ఆలోచనలు చేస్తున్నారు. ‘కాల్ మనీ’ స్కాంలో అన్ని రాజకీయ పార్టీల వారు భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ, వైసీపీకి చెందిన నేతలే ఎక్కువ మంది ఉన్నారని విచారణలో తేలుతోంది.

బహుశా చంద్రబాబు ప్రకటన చేసిన సమయంలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుందన్న భావనతోనే జగన్ ‘సస్పెండ్’ అయ్యే వరకు విషయాన్ని సాగదీసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదీ గాక, ‘సస్పెండ్’ అయిన తర్వాత పేపర్లు చింపి మరీ స్పీకర్ చాంబర్ లో విసిరికొట్టడం తదితర పరిణామాలతో… ప్రజా సమస్యలను చర్చించే అసెంబ్లీ పరువు తీస్తున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.