YS Jagan and Chandrababu Naidu Mansoon no rainsనైరుతి రుతుపవనాలు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించాయి. ఇవి చాలా చురుగ్గా కదులుతున్నాయి, తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో రాష్ట్రంలో పలుచోట్ల శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలను కూడా తెలుగు రాజకీయాలకు వాడుకుంటున్నారు మన రాజకీయ నాయకులు. అప్పట్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు కురవవని, వాన దేవుడు మా పార్టీ అని చెప్పుకునే వారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి.

ఆ తరువాత 2014లో జగన్ మోహన్ రెడ్డి కూడా అదే చంద్రబాబు మీద ప్రయోగించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారం మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వాతావరణ శాఖ ప్రకారం గడిచిన 12 ఏళ్ల కాలంలో అత్యంత ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఇవే కావడం విశేషం. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాలు మూడవ వారంలో వచ్చాయి. ఆ పాయింట్ తో టీడీపీ అభిమానులు జగన్ ను నిందిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వాతావరణాన్ని, వర్షాన్ని తమ రాజకీయాలకు వాడుకోవడం మానేస్తే మంచిది.

రాష్ట్రంలో దాదాపుగా అన్ని జలాశయాలు నీటిమట్టాలు వాటి సామర్థ్యంలో 10% కు పడిపోయాయి. రుతుపవనాల ఆలస్యం ఈ సీజన్ పై ప్రభావం చూపించకపోతే అదే పదివేలు. మరోవైపు తెలంగాణాలో కూడా రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఎప్పటిలానే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మొదలై పోయాయి. శుక్రవారం రాత్రి అన్ని ప్రధాన ఏరియాలలో ప్రజలు ట్రాఫిక్ వల్ల అష్టకష్టాలు పడ్డారు. చాలా మంది సాయంత్రం ఆఫీసు నుండి సాయంత్రం బయలుదేరితే అర్ధరాత్రి ఇంటికి చేరారు.