YS_Jagan_Amit_Shahఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో వరుసగా మూడోరోజు కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతకీ కారణం ఏమిటంటే వారందరూ పోడియంలోకి దూసుకువచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డి హటాత్తుగా ఢిల్లీ ఎందుకు వెళ్ళారో చెప్పాలని అడిగినందుకు.

లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరవుతుండటం, మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేయడంతో సీబీఐ అధికారులు నేడో రేపో అరెస్ట్ చేయడం ఖాయమని స్పష్టమైంది. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి వారిద్దరినీ కాపాడుకొనేందుకే హడావుడిగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో భేటీ అవుతున్నారని టిడిపి సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్రానికి సంబందించిన అంశాలు, రావలసిన నిధుల గురించి మాట్లాడేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని వైసీపీ చెపుతోంది.

కనుక సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై వాస్తవాలు చెప్పాలంటూ టిడిపి సభ్యులు శాసనసభలో పట్టుబట్టారు. స్పీకర్ వారించినప్పటికీ వారు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని మొత్తం 11 మంది సభ్యులను సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఒకేసారి ఇద్దరు వైసీపీ ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ ఒకే సమయంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరుక్కోవడం సిఎం జగన్మోహన్ రెడ్డికి చాలా ఆందోళన కలిగించే విషయమే. వీటిపై ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఏదోవిదంగా తట్టుకోవచ్చు… ఎదుర్కోవచ్చు. కానీ పార్టీలో అత్యంత సీనియర్లు అయిన ఇద్దరు ఎంపీలను ఈ కేసుల నుంచి రక్షించుకోలేకపోతే, పార్టీలో మిగిలిన ప్రజాప్రతినిధులకు, నేతలకు తమ నాయకుడిపై అపనమ్మకం ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.

సిఎం జగన్‌కు అత్యంత ఆప్తుడైన అవినాష్ రెడ్డినే కాపాడుకోలేకపోతే రేపు తమ పరిస్థితి ఏమిటని పార్టీలో మిగిలిన నేతలు ఆలోచించకుండా ఉండరు. తమకు ఏం జరిగినా జగన్‌ తమని కాపాడుకొంటాడనే ధీమా వారిలో ఉన్నంతకాలమే ఆయనకు, పార్టీకి విదేయంగా ఉంటారు. తమకి రక్షణ లభించదని తెలిసిన మరుక్షణం పార్టీ గోడ దూకేసి, బిజెపి ‘రక్షణ కవచాలు’ తొడ్డుకొనేందుకు వెనుకాడరు. ఇది రాజకీయాలలో ఉన్న అందరికీ తెలిసిన రహస్యమే.

అందుకే ఎన్నడూ సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటనల గురించి ప్రశ్నించని టిడిపి సభ్యులు ఈరోజు ఇంతగా పట్టుబడుతున్నారని భావించవచ్చు. సిఎం జగన్‌ ఇంత అకస్మాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో వైసీపీ చెప్పకపోయినా, ఈడీ, సీబీఐలో జరుగబోయే పరిణామాలే అన్ని విషయాలు ఎలాగూ చెపుతాయి.