YS Jagan - Amaravati - Three - Capitals -Andhra Pradeshవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల విషయంగా వ్యతిరేకత వస్తూనే ఉంది. నిపుణులు ఇది మంచి ఆలోచన కాదని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తాజాగా రాజ్యసభ అధికార ఛానల్ లో ఒక చర్చా కార్యక్రమంలో నిపుణులు ఈ నిర్ణయం ఎంత మాత్రం మంచిది కాదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది ఏమాత్రం తోడ్పడే అంశం కాదని అభిప్రాయపడ్డారు.

రాజ్యసభ టీవీలో ప్రసారమయ్యే ‘ద బిగ్‌ పిక్చర్‌’ కార్యక్రమంలో ఈనెల 21న ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బహుళ రాజధానులు, పాలన వికేంద్రీకరణ’ అంశంపై చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది, ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి, ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌, సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌ ఈ చర్చలో పాల్గొన్నారు.

ఒక్కరు కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయానికి మద్దతుగా మాట్లాడకపోవడం విశేషం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది ఆర్థికంగానూ భారమేనన్నారు. అధికార వికేంద్రీకరణకు ఆచరణ సాధ్యమైన విధానాలుండగా, వాటిని వదిలేసి పాలన వికేంద్రీకరణ చేయడమంటే ప్రజల నమ్మకాన్ని పాలకులు వమ్ము చేయడమేనన్నారు.

కార్యనిర్వాహక, శాసన రాజధానులు ఒకేచోట ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తిలేదు అంటుంది. మూడు రాజధానుల ఏర్పాటు ఆలస్యమైనా ఏర్పాటు మాత్రం జరిగి తీరుతుందని గట్టిగా చెబుతున్నారు.