YS-Jagan-Amaravatiమనుషులను మనుషులు చంపుకొంటారు. మనుషులు జంతువులను చంపడం తెలుసు. కానీ రాష్ట్ర రాజధానిని కూడా హత్య చేయవచ్చని వైసీపీ ప్రభుత్వం నిరూపించి చూపుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని చంపేసేందుకు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూనే ఉంది. అధికారంలోకి రాగానే మొదట నిర్మాణాలు ఆపేసింది. తర్వాత మూడు రాజధానుల పాట పాడుతూ మూడేళ్ళు అమరావతిని కోలుకోలేని దెబ్బ తీసింది. అయినా తాము కోరుకొన్నట్లుగా మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఎనిమిదేళ్ళ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. దీంతో రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడులు అన్నీ పొరుగు రాష్ట్రానికి తరలిపోతూనే ఉన్నాయి.

అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరు చూస్తే ‘ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతాను” వంటి సినిమా డైలాగులు గుర్తుకువస్తాయి.

‘అమరావతిని నిర్మించకూడదు’ అని ఫిక్స్ అయిన వైసీపీ ప్రభుత్వం, భవిష్యత్‌లో వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ రాజధాని నిర్మించలేని పరిస్థితులు సృష్టిస్తోంది. అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడానికేనని హైకోర్టును మభ్యపెడుతూ రాజధాని పరిధిలో భూములు అమ్మేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది.

రాజధాని కోసం రైతులు తమ జీవనోపాధిగా ఉండే భూములను త్యాగం చేసి ప్రభుత్వానికి ఇచ్చినందున, అవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీఆర్‌డీఏను, పటిష్టమైన చట్టాలను రూపొందించింది. రాజధాని భూములను రాజధానికి అవసరమైన కట్టడాలకు మాత్రమే వినియోగించాలనేది వాటిలో ఓ నిబందన. దానిని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం సవరించి, సుమారు 500 ఎకరాలలో పేదలకు ఇళ్ళు నిర్మించడానికి వీలుగా మార్చింది.

అయితే దీనిపై హైకోర్టు స్టే విధించే అవకాశం ఉంటుంది కనుక తెలివిగా ఈ వ్యవహారంలోకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జొప్పించింది. ఏవిదంగా అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ పధకంలో భాగంగా ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించింది. ఒకవేళ హైకోర్టు ఈ భూకేటాయింపులను అడ్డుకొంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేటాయింపులు జరిగేలా చేయకతప్పదు. లేకుంటే కేంద్ర ప్రభుత్వ పధకం నిలిచిపోయిందనే అప్రదిష్ట మోడీ ప్రభుత్వానికి చుట్టుకొంటుంది.

ఈవిదంగా నేటికీ ఓ పక్క మూడు రాజధానుల పాట పాడుతూనే అమరావతి నిర్మాణం కోసమేనంటూ రాజధాని పరిదిలో భూములు అమ్మేసుకొంటూ, ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను దీర్గకాలానికి లీజుపై ఇచ్చేస్తూ, రాజధాని భూములలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తూ వైసీపీ ప్రభుత్వం అమరావతిని హత్య చేస్తున్నట్లే వ్యవహరిస్తోంది.

ఒకవేళ మళ్ళీ తామే అధికారంలోకి వస్తే ఎలాగూ అక్కడ రాజధాని కట్టే ప్రసక్తే లేదు కనుక రాజధాని భూములు అమ్మేసుకొన్నా, పంచిపెట్టేసినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక అమరావతిలో ఏమీ మిగలకుండా చేస్తే అక్కడ రాజధాని నిర్మించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఇంత దూర, దురాలోచనలు చేయగలిగిన వైసీపీ ప్రభుత్వం, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎంత నష్టపోతుంది? ఎంత అవమానం, అప్రదిష్ట?అని ఆలోచించకపోవడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమే కదా?ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఇదీ పరిస్థితి రెండో ఛాన్స్ ఇస్తే ఏమవుతుందో?