అమరావతి రాజధానిగా పనికి రాదు అని చెప్పే దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ క్రమంలో రాజధానిపై అనేక రకాలుగా ఉన్నవి లేనివి చెబుతూనే ఉంది ప్రభుత్వం. తాజాగా దేశం మొత్తం మెచ్చుకుని, కేంద్ర ప్రభుత్వం సైతం ఫాలో అవుతున్న అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం లోపభూయిష్టం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్లాట్ల అబివృద్దికి 17500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మంత్రివర్గ ఉప సంఘం అంచనా వేసింది. ఆ ప్లాట్లను నిర్దేశిత ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రూ.కోటి పైనే ఖర్చవుతుందని పేర్కొంది.

ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉన్నప్పడు ఇక భూసమీకరణ వల్ల ఒరిగిన ప్రయోజనమేమిటని మంత్రులు ప్రశ్నించారని వార్తలు సూచిస్తున్నాయి. దీనికి బదులు రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని గత ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అన్నట్లు తెలిసింది.

ఒకవేళ భూసమీకరణకు, భూసేకరణకు ఒకటే రేటు అయినా ఇక్కడ ఒక కీలక విషయం కావాలనే విస్మరిస్తునట్టుగా కనిపిస్తుంది. భూసేకరణకు వెళ్తే అదే మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన సమయంలో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదనే కదా భూసమీకరణకు వెళ్ళింది.

17,500 కోట్లు భూసేకరణ అయితే డైరెక్టుగా రైతులకు వెళ్ళేది. ఇప్పుడు అదే మొత్తం వల్ల భూములు వస్తున్నాయి, అదే సమయంలో ప్లాట్ల అభివృద్ధి వల్ల ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఆ ప్లాట్ల క్రయవిక్రయాల వల్ల మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మనం చూడకూడదు అనుకున్నప్పుడు అందులోని మంచి ఎలా కనబడుతుంది?