YS Jagan Amaravati
మూడు రాజధానుల పేరిట అమరావతిని కాలగర్భంలోకి కలిపేయడానికి రంగం సిద్ధం అవుతుంది. మూడు రాజధానుల బిల్లులకు రాజముద్ర పడటంతో ప్రభుత్వం అమరావతి నుండి తన యంత్రాంగాన్ని తరలించే పనిలో పడింది. అమరావతి ఇక నుండి కేవలం ఏడాదికి 50-60 రోజులు మాత్రమే రాజధాని కళ సంతరించుకుంటుంది.

అది కూడా ప్రభుత్వం అన్ని సమావేశాలను ఇక్కడే నిర్వహిస్తే. దీనితో అక్కడ ఏదో అభివృద్ధి జరిగిపోతుంది అంటే వట్టి మాటే. అలాగే రాజధానికి భూములిచ్చిన దాదాపుగా 30,000 రైతు కుటుంబాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అమరావతిని కాలగర్భంలో కలపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కు బీజేపీ కూడా సహకరించింది అనే చెప్పుకోవాలి.

“చంద్రబాబు, అతని తాబేదారులు, కమ్మ కులంలోని ప్రముఖులు అంతా అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అని జగన్ నమ్మకం. ఒక్క దెబ్బతో వారి ఆర్ధిక మూలాలు మొత్తం పెకిళించి వేశారు. అందులోని వారు ఈ దెబ్బ తట్టుకోలేకపోతే మంచిది. తట్టుకుని నిలబడినా తమ నష్టం చంద్రబాబు వల్లే అని వారు టీడీపీకి దూరం జరగడం ఖాయం. ఏది జరిగినా జగన్ కు లాభమే,” అంటున్నారు విశ్లేషకులు.

“ఆ వాదనతోనే జగన్ బీజేపీ హై కమాండ్ ని కన్విన్స్ చేసి ఉంటారు. తెలుగుదేశం పార్టీని అడ్డు తప్పిస్తే.. ఆ తరువాత మిగిలేది మీరు మేమే. ముందు ఆయన అడ్డు తప్పిస్తే తరువాత మీరు మేము ఏలుకోవడమే అని జగన్ బీజేపీ పెద్దలకు చెప్పి వారిని అడ్డు రాకుండా ఆపారు,” అంటూ వారు విశ్లేషిస్తున్నారు.