ys jagan all this is pre plannedపొరపాటున చెప్తారో లేక కావాలని చెప్తారో గానీ, మంత్రి పేర్ని నాని చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ విడుదల తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా బాలకృష్ణకు సంబంధించి నాని చేసిన వ్యాఖ్యలతో ఇతర హీరోల అభిమానులు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. ‘బాలకృష్ణ గారు వస్తానంటున్నారు’ అని సీఎం గారితో అంటే, ఎందుకు అని అడిగారని, ‘అఖండ’ సినిమా గురించో, దేని గురించో మాట్లాడడానికి వస్తారేమో అన్నానని చెప్పిన పేర్ని నానికి సీఎం బదులిస్తూ, ‘వద్దు నాని, ఆయనకేం కావాలో అది చూసి చేసేయండి, ఆయన క్యారెక్టర్ పోతుంది’ అంటూ చెప్పినట్లుగా వివరించారు.

అయితే మరి సీఎం వద్దకు విచ్చేసిన చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివల క్యారెక్టర్ పరిస్థితి ఏంటి? అన్న కోణంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అంటే సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలను రప్పించడం, వారికి అవమానం జరిగేలా చేయడం అనేది అంతా ప్రీ ప్లానింగ్ తో జరుగుతోందా? అన్న ఆలోచనలకు మంత్రి నాని మాటలు ఆస్కారం కల్పించాయి.

సహజంగా కారు వెళ్లే రూటు వరకు కాకుండా ముందుగానే కారు ఆపించి కొంతదూరం నడిపించడం మొదలుకుని మెగాస్టార్ వందనాల వరకు అడుగడుగునా మెగాస్టార్ బృందానికి ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ముందుగానే జగన్ అండ్ కో నిర్ణయించేసుకున్నారా? ఇంతకుముందు వరకైతే ఇలాంటి భావన వ్యక్తం కాలేదు గానీ, నాని చేసిన వ్యాఖ్యలు వీటికి ఆస్కారం కల్పించింది. నాడు రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలకు నేడు బలం చేకూరుతోంది.