YS jagan agrees on KCR support to YSRCPతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం మద్దతు ఇస్తున్నారని, కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు వైసీపీ అధ్యక్షుడు జగన్‌. దీనితో వైకాపా తెరాసలకు ఉన్న చీకటి ఒప్పందం బయటపెట్టేశారు ఆయనే. రాష్ట్రంలో ఉన్న 25మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది జత అయితే, మొత్తం 42 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదాకోసం మద్దతిస్తే… హర్షించాల్సిందిపోయి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తావా అని చంద్రబాబును ప్రశ్నించారు.

ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ను తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడే అంశానికి మద్దతు ఇస్తున్నారంటే నమ్మే అంత అమాయకులు కాదు జగన్. మరి ఏ ఉద్దేశంతో వారిని నమ్మిద్దాం అని జగన్ అలా ప్రకటించారో ఎవరికీ అర్ధం కానిది. ‘చంద్రబాబుకు కూడా హైదరాబాద్‌లో స్థిరనివాసం ఉంది. అనేక మంది ప్రముఖులు అక్కడున్నారు. వారికి అభద్రతాభావం ఎక్కడైనా కలిగిందా? చంద్రబాబు భావోద్వేగాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు జగన్.

కేసీఆర్ పాలనకు క్లీన్ చిట్ ఇవ్వడంలో జగన్ ఆత్రుత ఒకింత ఆశ్చర్యం కలిగించేది. జగన్ ముందు అనుకుని చేశారో అనుకోకుండా చేశారో గానీ ఈ వ్యాఖ్యలు వైకాపా అభ్యర్థుల మీద, నాయకుల మీద, కార్యకర్తల నెత్తి మీద పిడుగు పడినట్టు అయ్యింది. గ్రామాలలో దీనికి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వారిది. ఎన్నికలకు మూడు వారాలు కూడా లేని ఈ సమయంలో వేసుకున్న ఈ సెల్ఫ్ గోల్ కు తాము భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు.